Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌వాల్‌ కు టీడీపీ కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   7 Nov 2016 3:24 PM GMT
జ‌గ‌న్ స‌వాల్‌ కు టీడీపీ కొత్త ట్విస్ట్‌
X
విశాఖ‌లో జ‌గ‌న్ నిర్వ‌హించిన జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భ‌పై ఆరోప‌ణ‌లు- ప్ర‌త్యారోప‌ణ‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం త‌న పార్టీ ఎంపీల‌తో అవ‌స‌ర‌మైతే రాజీనామా చేయిస్తాన‌ని వైఎస్ జ‌గ‌న్ స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఘాటుగా స్పందించారు. ఎంపీల రాజీనామాల‌కు బ‌దులుగా ఎమ్మెల్యేల‌తో ప‌దవుల‌కు గుడ్ బై చెప్పించాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.

ప్ర‌త్యేక హోదా కోసం అనవసరంగా ఎంపీలను బలిచేయడం ఎందుకని పేర్కొన్న గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు బ‌దులుగా జ‌గ‌న్‌ తో పాటు 47 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల‌న్నారు. అలా ఉప‌ ఎన్నికలకు వస్తే, తిరిగి ఒక్కటి తగ్గకుండా గెలిస్తే అప్పుడు జ‌గ‌న్ చెప్తున్న హోదా డైలాగులు ప్రజలు నమ్మినట్లు భావిస్తామన్నారు. . ఇదివరకే ఎస్పీవైరెడ్డి సహా ఇద్దరు ఎంపీలు వైసీపీ నుంచి పారిపోయారని...మిగిలిన 6 మంది కూడా పారిపోయేటట్టున్నారని ఎద్దేవా చేశారు. హోదా ఇచ్చేది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అయితే జగన్ టార్గెట్ చేస్తున్నది చంద్రబాబుని అని గాలి ముద్దుకృష్ణ‌మ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఒక్కమాటైనా మోడీని నిలదీసిన పాపాన పోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రత్యేక హోదా కోసం జైట్లీ - వెంకయ్య పార్లమెంట్లో లేవదీస్తే - ఎంపీగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా అడగలేకపోయారని అన్నారు. ప్రజలు జగన్‌ను నమ్మినట్టే నమ్మి ఆఖరి రెండు రోజుల్లో కళ్లు తెరిచారని చెప్పారు. వైసీపీ చేతికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మరోసారి పీల్చి పిపిచేస్తారని భయపడ్డారని అందుకే టీడీపీ అధికారం ద‌క్కింద‌న్నారు. ఎంపీలు కష్టపడి గెలిసే ఇప్పుడు రాజీనామాలు చేయిస్తామంటున్నారని గాలి వ్యాఖ్యానించారు ఇసుక నుంచి అమరావతి దాకా అవినీతి అంటున్న జగన్ ఇసుక - మట్టి - ఇనుప ఖనిజాలతో మాఫియాలను సృష్టించి చైనాకు ఖనిజాలను తరలించి జేబులు నింపుకున్నది జనానికి తెలియదా అని నిల‌దీశారు. విశాఖలో బీచ్ ఫెస్టివల్ అనే పైవేటు కార్యక్రమాన్ని అడ్డంపెట్టుకొని యాగీ చేస్తున్న వైకాపాకు అక్కడ బికినీ షో జరుగుతుందని ఎవరు చెప్పారని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్‌ తండ్రి పాలనలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రస్తుతం కేవలం 42 మందికి తగ్గించగలగడం చంద్రబాబు ఘనత కాదా అని గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ప్ర‌శ్నించారు. 72 శాతం మంది రైతులు రుణమాఫీతో లబ్ది పొంది ఆనందంగా ఉన్నారని అన్నారు. విద్యా విప్లవం తెచ్చింది వైఎస్ కాదు చంద్రబాబు అని గాలి ప్ర‌శంసించారు. ఇంజనీరింగ్ - బీఈడీ వంటి వివిధ కళాశాలలు - సత్యం - మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి రాబట్టింది చంద్రబాబు అని తెలిపారు. చివరికి సత్యం రామలింగరాజును బెదిరించి అవినీతి దారికి మళ్లించి, కొట్టించి, జైలుపాలు చేసిన ఘనత నీ తండ్రిదని గాలి ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట అభివృద్ధి రేటు 10.99 శాతం ఉంటే ప్రతిపక్ష నాయకుడు సహించలేకపోతున్నారని, ఇదంతా మద్యం ఆదాయమని అబద్దాలు చెప్పజూస్తున్నారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 12.26 శాతంతో ఈ ఏడాది తొలి తైమాసికంలో వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోనే తొలిసారి రెండంకెల వృద్ధిరేటును సాధిస్తున్న సర్కార్ చంద్రబాబు సర్కార్ అని ప్ర‌శంసించారు. పోలవరం నిధుల కోసం, రాజధాని కోసం, పెట్టుబడుల కోసం చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని పోరాడుతున్నారని ప్ర‌శంసించారు. మిగులు జలాలు సముద్రం పాలు కాకుండా పట్టిసీమను రూపొందిస్తే అభినందించలేని వైకాపా సీమకు 25 లక్షల ఎకరాలకు హంద్రీనీవా, గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులతో సాగునీరందించడానికి చంద్రబాబు సిద్ధపడుతుంటే సహించలేకపోతోందని ముద్దుకృష్ణ‌మ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/