Begin typing your search above and press return to search.

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కంటే.. ఆయ‌న భార్య ఆస్తులే ఎక్కువ‌!

By:  Tupaki Desk   |   19 April 2023 12:41 AM IST
గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కంటే.. ఆయ‌న భార్య ఆస్తులే ఎక్కువ‌!
X
క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి గురించి దేశ‌వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. మైనింగ్ కింగ్‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. అంతేకాదు.. త‌న కుమార్తె వివాహాన్ని అత్యంత అట్ట‌హాసంగా నిర్వ‌హించి.. రికార్డు సృష్టించారు. ఆహ్వానితుల‌కు బంగారు కానుక‌లు ఇచ్చారు. ఆహ్వాన ప‌త్రిక‌లోనే ఇర‌గ‌దీశారనే పేరు తెచ్చుకున్నారు. ఇక‌, తిరుమ‌ల శ్రీవారికి నిలువెత్తు బంగారు కిరీటం చేయించి కానుకగా ఇచ్చారు. ఇలాంటి.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి.. ఇప్పుడు సొంత‌గా `క‌ళ్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష‌` పేరుతో సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు.

ఈ ఏడాది మేలో జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ పార్టీ త‌ర‌ఫున క‌ళ్యాణ క‌ర్ణాట‌క‌లోని 40 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. త‌న పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను కూడా నిల‌బెట్టారు. వీరిలో గాలి స‌తీమ‌ణి ల‌క్ష్మీ అరుణ బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి పోటీకి దిగారు. సోమవారం గాలి లక్ష్మీ అరుణ నామినేన్ వేశారు. నామినేషన్ సందర్బంగా లక్ష్మీ అరుణ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల మేర‌కు.. అఫిడ‌విట్ స‌మ‌ర్పించారు. అయితే.. ఈ అఫిడ‌విట్‌లో ఆమె త‌న‌కు ఆస్తులు ఉన్నాయ‌ని చెప్పినా.. సొంత‌గా ఒక్క కారు కూడా లేద‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

లక్ష్మీ అరుణ అఫిడ‌విట్‌లో పేర్కొన్న వివ‌రాల మేర‌కు ఆమె పేరుతో ఉన్న‌ చరాస్తి విలువ రూ.96.23 కోట్లు, గాలి జనార్దన్ రెడ్డి చరాస్తి విలువ రూ.29. 20 కోట్లుగా ఉంది. ఈ దంప‌తుల కుమారుడు గాలి కిరీటి రెడ్డికి రూ.7. 24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అయితే.. వీరి పేరుతొ ఒక్క కారు కూడా లేదట‌. ఇక‌, స్థిరాస్తుల విష‌యాల‌కు వ‌స్తే.. గాలి లక్ష్మీ అరుణకు రూ.104 కోట్ల స్థిరాస్తి ఉంది. ఆమె భ‌ర్త‌ గాలి జనార్దన్ రెడ్డికి రూ.8 కోట్ల విలువైన స్థిరాస్తి ఉన్న‌ట్టు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

వీరి కుమారుడు గాలి కిరిటీ రెడ్డికి రూ.1.24 కోట్ల స్థిరాస్తి ఉందని లక్ష్మీ అరుణ అఫిడవిట్ లో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కంటే ఆయన భార్య లక్ష్మీ అరుణకు ఎక్కువ ఆస్తి ఉందని తెలిసింది. అదేవిధంగా లక్ష్మీ అరుణకు 84 కేజీల బంగారు, వజ్రాల నగలు ఉన్నాయని, 437 కేజీల వెండి ఉందని, మొత్తం ఆమె ఆస్తి విలువ సుమారు రూ.250 కోట్లు ఉందని వెలుగు చూసింది. అయితే, ఈ కుటుంబానికి కారు లేక‌పోవ‌డం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇదిలావుంటే, గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి సొంత‌గా హెలికాప్ట‌ర్ ఉన్న విష‌యం తెలిసిందే.