Begin typing your search above and press return to search.

జగన్ కోసం రంగంలోకి దిగిన మైనింగ్ కింగ్

By:  Tupaki Desk   |   2 April 2016 11:55 AM IST
జగన్ కోసం రంగంలోకి దిగిన మైనింగ్ కింగ్
X
రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చినట్లే వచ్చి ఆగిపోవడానికి కారణమేంటి..? టీడీపీ ఆకర్ష పథకం ముందుకు సాగకపోవడానికి రీజనేంటి? వీటన్నిటికీ సమాధానం చంద్రబాబో, జగనో కాదట... కర్ణాటక మాజీ మంత్రి - మైనింగ్ కింగ్ గాలి జనార్దన రెడ్డట. అవును... చంద్రబాబు విసిరిసన ఆకర్షణ వలతో గిలగిలలాడిన వైసీపీ అధినేత జగన్ ను రక్షించడానికి ఆయన మిత్రుడు గాలి జనార్దన రెడ్డి రంగంలోకి దిగారు. అక్రమాల్లో కానీ, అవినీతిలో కానీ, రాజకీయాల్లో కానీ... రాజకీయ అక్రమాల్లో కానీ.. అన్నిట్లో ఆరితేరిపోయిన గాలి ఇప్పుడు జగన్ కోసం రంగంలోకి దిగారని సమాచారం. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లకుండా ఆయన అడ్డుచక్రం వేస్తున్నారని... వారిని నేనున్నానంటూ అభయ హస్తం ఇచ్చారని... గాలి టాలెంటు తెలిసిన వైసీపీ నేతలు ఆయన మాట విని ఆగారని టాక్.

వైఎస్ రాజశేఖరరెడ్డి - జగన్ లకు గాలి మంచి మిత్రుడు. తాను జైలు పాలవడం వెనుక చంద్రబాబు హస్తం కూడా ఉందని గాలి బలంగా నమ్ముతుంటారు. దీంతో మిత్రుడు జగన్ ను ఆదుకునేందుకు.. శత్రువు చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఆయన ఏపీ పాలిటిక్సులో వేలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేలకు గట్టి హామీ ఇచ్చారట. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, వైసీపీని మాత్రం వీడి వెళ్లొద్దని వారికి వర్తమానం పంపించారట గాలి. ఆయన తరఫున ముఖ్య అనుచరుడు బి.శ్రీరాములు రాయలసీమలో ఈ వ్యవహారాలు చక్కబెట్టినట్లు సమాచారం. శ్రీరాములు ప్రస్తుతం బళ్లారి ఎంపీగా ఉన్నారు. బీజేపీకి చెందిన ఆయన కూడా గతంలో కర్ణాటకలో మంత్రిగా పనిచేశారు. గాలి జనార్దన రెడ్డి కూడా బీజేపీ నాయకుడే... గాలికి అనుంగు శిష్యుడు శ్రీరాములు.

కాగా గాలి కారణంగానే రాయలసీమలో టీడీపీ ఆకర్ష ముందుకు సాగడంలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. చంద్రబాబు కూడా గాలి కాదు ఎవరు అడ్డొచ్చినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలను తేవాల్సిందేనని సీమ నేతలకు ఆర్డరిచ్చారట. కాగా గాలి, శ్రీరాములు అంతా బీజేపీ పెద్దలకు అత్యంత దగ్గరి మనుషులు అయినందున ఈ వ్యవహారంలో బీజేపీకి తెలియకుండా ఇదంతా సాగుతుందా అన్నదీ ఆలోచించాల్సిందే. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని చంద్రబాబు మరింత బలపడకుండా ఉండేందుకు గాను బీజేపీ కూడా జగన్ ను కాపాడే పనిలో పడినా పడొచ్చు.