Begin typing your search above and press return to search.

బాబాయ్ మీద సంచయిత సంచలనం.. ?

By:  Tupaki Desk   |   22 Dec 2021 5:01 PM IST
బాబాయ్ మీద సంచయిత సంచలనం.. ?
X
విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీకులకు ఉన్న విలువ గౌరవం ఎన్నతగినది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థానాలకు వారు వారసులు. ఇక మాన్సాస్ ట్రస్ట్ లాంటి వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలను కల్పించారు. ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేశారు. ఆ వంశీకులలో ప్రస్తుతం పెద్దగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2020 మార్చి నెలలో హఠాత్తుగా అశోక్ ని తప్పించి ఆయన అన్న గారైన ఆనందగజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజుని చేసింది. దాని మీద అప్పట్లో కోర్టుకు వెళ్ళిన అశోక్ విజయం సాధించారు. ఆయన్ని తప్పించడం నిబంధనల‌ మేరకు తప్పు అని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. అయితే ఇది జరిగి ఆరు నెలలు పై దాటింది.

ఇన్నాళ్ల తరువాత మన్సాస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆమె డివిజన్ బెంచి లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా సంచయిత గజపతిరాజు తానే మాన్సాస్ చైర్ పర్సన్ పదవికి అర్హురాలిని అని ఎలా రుజువు చేసుకుంటారు, నిబంధలన ప్రకారం తన నియామకం చెల్లుతుంది అని ఎలా వాదిస్తారు అన్నదే ఆసక్తికరంగా ఉంది.

మాన్సాస్ బైలాస్ ప్రకారం పూసపాటి వంశీకులలో కుటుంబ పెద్దకు మాత్రమే చైర్మన్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారుట. అదే విధంగా మగవారికి మాత్రమే అవకాశమని కూడా బైలాస్ లో పొందుపరచారు అని తెలుస్తోంది.

అయితే ఇక్కడే సంచయిత లాజిక్ పాయింట్ ని పట్టుకుని సవాల్ చేశారు అంటున్నారు. ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానమే కాబట్టి పదవుల విషయంలో లింగ వివక్ష ఎలా వర్తిస్తుంది అన్నదే ఆమె వాదనగా ఉందని అంటున్నారు.

అలాగే కుటుంబ పెద్ద అంటే పూసపాటి వారి వంశంలో పెద్ద వారు ఆనందగజపతిరాజు, ఆయన తరువాత పెద్ద కుమార్తెగా తనకే వారసత్వ హక్కు కూడా ఉంటుందని ఆమె వాదిస్తూ వస్తున్నారు. మొత్తానికి చూస్తే అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సంచయిత సవాల్ చేసి సంచలనమే రేపారు.

ఇన్నాళ్ళూ ఆమె సైలెంట్ గా ఉన్నారు, దాంతో ఈ వివాదం ఇంతటితో సమసిపోయింది అనుకున్నారు. కానీ ఆమె పూర్తి వివరాలతోనే పిటిషన్ దాఖలు చేశారని చెబుతున్నారు. పైగా ఆమె న్యాయవాది కావడంతో ఈ కేసులో ఏ విధంగా తనకు న్యాయం జరిగేలా చేసుకోగలరు అన్న చర్చ కూడా సాగుతోంది. సంచయిత పిటిషన్ తో మరో మారు బాబాయ్ అమ్మాయి ల మధ్య రచ్చకు తెరలేచింది అనుకోవాలి.