Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంటే ఎక్కువగా రేవంత్‌ను బాధ పెడుతోంది ఎవ‌రంటే...

By:  Tupaki Desk   |   18 Feb 2022 3:16 AM GMT
కేసీఆర్ కంటే ఎక్కువగా రేవంత్‌ను బాధ పెడుతోంది ఎవ‌రంటే...
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా విరుచుకుప‌డే టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లోనే ఒకింత సంఘీభావ స‌మ‌స్య ఉన్న సంగ‌తి తెలిసిందే.

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉండే కాంగ్రెస్ పార్టీలో విప‌క్ష నేత‌ల కంటే సొంత పార్టీ నేత‌ల‌పైనే కామెంట్లు చేస్తుంటారు. తాజాగా అలాంటి కామెంట్‌ను రేవంత్ రెడ్డి ఎదుర్కున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవ‌ల స‌మావేశ‌మై విభేదాల‌కు చెక్ పెట్టారని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్న స‌మ‌యంలోనే టి.పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సంద‌ర్భంగా వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వ‌డం, ఈ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో సంబురాలు జ‌రుగుతుంటే ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ కూడా చేశారు. అయితే, టి.పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఎపిసోడ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జ‌గ్గారెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం చేసుకోవడంలో తప్పేముంది..? అని ప్రశ్నించారు. సీఎం బర్త్‌డేకు నిరుద్యోగానికి సంబంధం ఏంటి? అని సొంత పార్టీ నేత‌ల‌ను నిలదీశారు! అంతేకాకుండా తాజాగా తలపెట్టిన నిరసన ప్రోగ్రాం గురించి నాకు తెలియదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ డమ్మీ పోస్టుగా చెప్పుకొచ్చిన జ‌గ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కి చెప్పి అన్ని కార్య‌క్ర‌మాలు చేయాలని రూల్‌ లేదంటూ రేవంత్ గురించి సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారిన పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీపై స్పందించిన జగ్గారెడ్డి ఈ ఇద్ద‌రు నేత‌లు స‌మావేశం అవ‌డం మంచి పరిణామంగా తెలిపారు.

స‌హ‌జంగానే జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఓవైపు కాంగ్రెస్ నేత‌లు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే మ‌రోవైపు సొంత‌ పార్టీ నేత‌ల‌పైనే జ‌గ్గారెడ్డి కామెంట్లు చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.