Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోని ఆ ప్రముఖ క్రీడాకారుడి ఇంట్లోకి వరద నీరు

By:  Tupaki Desk   |   16 Oct 2020 9:30 AM IST
హైదరాబాద్ లోని ఆ ప్రముఖ క్రీడాకారుడి ఇంట్లోకి వరద నీరు
X
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివసిస్తుంటారు. తాజాగా గురించిన భారీ వర్షాలతో సామాన్యులే కాదు.. ప్రముఖులు సైతం తీవ్ర ప్రభావానికి గురయ్యారు. ఆ తీవ్రత ఎంతన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ ఇల్లే నిదర్శనం. సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో నారంగ్ ఇల్లు ఉంటుంది. ఆయన త్వరలో పేద క్రీడాకారుల కోసం ‘‘గన్ ఫర్ గ్లోరీ’’ అకాడమీని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని ఈ అకాడమీకి అవసరమైన రైఫిళ్లు.. పిస్టళ్లు విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.

రూ.1.3కోట్ల తన సొంతసొమ్ముతో తెప్పించిన ఆయుధాలు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయాయి. జర్మనీ నుంచి తెప్పించిన రైఫిళ్లు.. పిస్టళ్లను నవంబరు ఒకటి నుంచి ప్రారంభించే గచ్చిబౌలి అకాడమీ కోసం ఆయన తెప్పించారు. ఊహించని విధంగా కురిసిన భారీ వర్షానికి తిరుమలగిరి లోని ఆయన ఇంట్లోకి 8 అడుగుల మేర నీరు చేరినట్లు చెప్పారు. తాను ఎంత ప్రయత్నించినా షెట్టర్ తెరుచుకుపోలేదన్నారు.

దీంతో తాను తెప్పించి 90 రైఫిళ్లు.. పిస్టళ్లు నీటిలో మునిగిపోయాయని.. ప్రస్తుతానికి వాటిని తాను ఆర బెట్టినట్లు చెప్పారు. వాటిల్లో ఎన్ని పనికి వస్తాయి.. ఎన్ని పాడవుతాయో తనకు అర్థం కావట్లేదన్నారు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వాటిని వాడలేదని.. గచ్చిబౌలికి తీసుకెళ్లే ముందు ఇంట్లో ఉంచానని.. ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని తానేమాత్రం ఊహించలేదన్నారు.

ఇలాంటి విపత్తు ఎదురవుతుందన్నఆలోచన కనీసం లేకపోవటంతో తాను వాటికి బీమా చేయించలేదన్నారు. తన అకాడమీ ద్వారా పేద క్రీడాకారులకు సాయం చేయాలన్న తన లక్ష్యం నెరవేరేలా లేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి షూటర్లను తయారు చేయాలన్న తన స్వప్నానికి గండిపడినట్లుగా వావపోయాడు. తన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడని.. ఇప్పుడేం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. తొమ్మిదేళ్లుగా అకాడమీ కోసం తానుపడ్డ కష్టం మొత్తం వరదపాలైనట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ నష్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.