Begin typing your search above and press return to search.

నేడు వైసీపీలోకి మాజీ మంత్రి చేరిక

By:  Tupaki Desk   |   16 March 2020 4:10 AM GMT
నేడు వైసీపీలోకి మాజీ మంత్రి చేరిక
X
అసలే ఎండాకాలం.. ఉక్కపోత.. ఈ వేడిలో సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు సేద తీరడానికి వచ్చేస్తున్నారు. పచ్చపార్టీపై నమ్మకం సడలి వైసీపీ అధినేత జగన్ పై నమ్మకం పెరిగి వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగులనుంది. సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సోమవారం వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

గాదె వెంకటరెడ్డిని వైసీపీలోకి చేర్పించడంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మంత్రి బాలినేని స్వయంగా గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు తెలుగు యువత నాయకుడు మధుసూదనరెడ్డితో చర్చలు జరిపి వారిని వైసీపీలో చేరేందుకు ఒప్పించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వారిద్దరూ టీడీపీకి రాజీనామా కూడా చేసినట్లు తెలిసింది.

*గాదె వెంకటరెడ్డి రాజకీయ చరిత్ర
పర్చూర్ నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 1991లో పర్చూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2004 ఎన్నికల సమయంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కాంగ్రెస్ లో చేరడంతో నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాదెను బాపట్ల కు మార్చి పోటీచేయించారు. గాదె వరుసగా బాపట్ల నుంచి 2004,2009 ఎన్నికల్లో గెలుపొందారు.

2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం గాదె , ఆయన కుమారుడు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారు. మంత్రి బాలినేని వీరి చేరికను దగ్గరుండి చూస్తున్నారు.బాపట్ల, పర్చూరు నియోజకవర్గాలపై గాదెకు పట్టుంది. కుమారుడు మధుసూదనరెడ్డిని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని గాదె భావిస్తున్నారు. బాపట్లలో వైసీపీ ఎమ్మెల్యే ఉండగా.. పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. అందుకే గాదె కుటుంబానికి పర్చూరు ఇవ్వడానికే వైసీపీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిసింది.