Begin typing your search above and press return to search.

టీడీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా గ‌ద్దె రామ్మోహ‌న్!

By:  Tupaki Desk   |   19 Jun 2022 1:30 PM GMT
టీడీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా గ‌ద్దె రామ్మోహ‌న్!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుంచి పార్ల‌మెంటుకు టీడీపీ త‌ర‌ఫున గ‌ద్దె రామ్మోహ‌న్ పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌ద్దె రామ్మోహ‌న్ ప్ర‌స్తుతం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్సార్సీపీ గాలి బ‌లంగా వీచిన గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించారు. 2014లోనూ అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. గ‌తంలో గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. గద్దె స‌తీమ‌ణి అనురాధ టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

1994లో గ‌న్న‌వ‌రం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన చ‌రిత్ర.. గ‌ద్దె రామ్మోహ‌న్ రావుది. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన గ‌ద్దెకు అన్ని కులాల్లోనూ.. ముఖ్యంగా కాపుల్లోనూ మంచి అభిమానం ఉంది. వివాదర‌హితుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుంచి లోక్ స‌భ‌కు పోటీ చేయించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ల‌పోస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌ద్దె రామ్మోహ‌న్ పోటీ చేస్తే.. ఈ ప్ర‌భావం ఆ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కూడా ఉంటుంద‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న అని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఎంపీగా టీడీపీకే చెందిన కేశినాని నాని ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న టీడీపీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హరిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో టీడీపీ కీల‌క నేత‌లైన బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరాల‌తో కేశినాని నానికి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ విబేధాలు రోడ్డుకెక్కాయి. బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు. మ‌రోవైపు కేశినేని నాని కూడా టీడీపీ అధినేతను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. మ‌ళ్లీ ఇటీవ‌ల కాలంలో కాస్త మెత్త‌బ‌డ్డారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేశినాని నానికి సీటు ఇస్తే బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాలు కేశినేని నానికి స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదంటున్నారు. వైఎస్సార్సీపీ గాలిలోనూ గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటును గెలుచుకున్న టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దీన్ని పోగొట్టుకోవ‌డానికి సిద్ధంగా లేదు. ఈ నేప‌థ్యంలో వివాద‌ర‌హితుడిగా పేరున్న గ‌ద్దె రామ్మోహ‌న్ ను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది.