Begin typing your search above and press return to search.

టార్గెట్ కేసీఆర్ వ‌యా గ‌ద్ద‌ర్‌..గ‌జ్వేల్‌ లో కొత్త స్కెచ్‌

By:  Tupaki Desk   |   24 Nov 2018 3:08 PM GMT
టార్గెట్ కేసీఆర్ వ‌యా గ‌ద్ద‌ర్‌..గ‌జ్వేల్‌ లో కొత్త స్కెచ్‌
X
గులాబీ ద‌ళ‌ప‌తి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రి చూపు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గులాబీ ద‌ళ‌ప‌తికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అనుకున్నంత సానుకూల‌త లేద‌ని - ఈ ద‌ఫా ఆయ‌న గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కేం కాద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ ఇక్క‌డ ప్ర‌జాయుద్ధ నౌక గ‌ద్ద‌ర్ సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకు తాజాగా - యూపీఏ చైర్‌ ప‌ర్స‌న్ సోనియాగాంధీ నిర్వ‌హించిన స‌భలో పోషించిన పాత్ర నిద‌ర్శ‌న‌మంటున్నారు.

మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు హాజరైన గద్దర్‌ - ఆయన సతీమణి విమల - తనయుడు సూర్యకిరణ్‌ - యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా విమల సోనియాకు చీరను బహూకరించారు. ఆ తర్వాత గద్దర్‌ మాట్లాడుతూ కాలాన్ని పార్లమెంట్‌లో బంధించి తెలంగాణను ప్రసవింపజేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలని తెలిపారు. పసిబిడ్డలాంటి తెలంగాణను పాలకుల చేతిలో పెడితే ఆ పాలకులు పాలు ఇవ్వకుండా జోలపాట పాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తెలంగాణ పసిబిడ్డను ఒడిలోకి తీసుకుని దీవించడానికి సోనియా వచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో ఆయన పాడిన పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటను పాడి ఆహుతులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ పాట ఎక్కడ వినపడ్డా తెలంగాణ ఉద్యమకారుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మేడ్చల్‌ కాంగ్రెస్‌ సభలోనూ అటువంటి అనుభవమే ఆవిష్కృతమైంది. తాను పాడుతున్న పాటకు అందరూ కోరస్‌ ఇవ్వాలని కోరడంతో సభకు వచ్చిన వారంతా ఆయనతో గొంతు కలిపారు. గద్దర్‌ పాట పాడుతుండగానే చప్పట్లు - ఈలలతో వేదికపై ఉన్న నాయకులు - వేదిక కింద కూర్చున్న నాయకులు - కార్యకర్తలు సభను హోరెత్తించారు.

వామ‌ప‌క్ష ఉద్యమ నేపథ్యం ఉన్న గద్దర్ కొద్దికాలం క్రితం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీఆర్ ఎస్‌ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి బరిలో దిగుతానని - స్వతంత్య్రంగా పోటీ చేస్తున్న తనకు ఆయా పార్టీలు మద్దతు ఇవ్వాలని గద్దర్‌ కోరారు. అనంతరం తాను పోటీ చేయబోనని - ప్రచారం మాత్రం చేస్తానని ఆయన వివరించారు. గ‌ద్ద‌ర్ పోటీ చేయ‌డం కంటే ప్ర‌తాప్‌ రెడ్డి బ‌రిలో దిగ‌డం స‌రైన‌ది భావించిన కాంగ్రెస్ ఆయ‌న‌కే చాన్సిచ్చింది. అయితే, గ‌ద్ద‌ర్ సేవ‌లు సైతం ఉప‌యోగించుకోవాల‌ని భావించి ఆయ‌నతో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.