Begin typing your search above and press return to search.

ఐసిస్ ను లేకుండా చేస్తామని శపధం చేశారు

By:  Tupaki Desk   |   16 Nov 2015 3:49 AM GMT
ఐసిస్ ను లేకుండా చేస్తామని శపధం చేశారు
X
పలువురు దేశాధినేతలు ఒక చోటకు చేరారు. ఎప్పటిలా వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగా సదస్సు జరగలేదు. అద్యంతం భావోద్వేగంతో.. ఉద్విగ్నతతో జరిగిన సదస్సుకు భారత ప్రధాని మోడీ మాటలు మరింత బలంగా మారాయి. ప్యారిస్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సంస్థను ఒకటి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చేయటంతో పాటు.. ఇస్లామిక్ స్టేట్ అంతమే తమ పంతంగా మారాలని జీ20.. బ్రిక్స్ దేశాధినేతలు తమ పూర్తి సంఘీభావం వ్యక్తం చేసేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

టర్కీలోని అంటాల్యాలో జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో మాట్లాడిన మోడీ.. ప్యారిస్ దాడులను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునివ్వటంతో పాటు.. మానవాళి మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకం కావాలని.. ఇంతకు మించిన ప్రాధాన్యతా అంశం మరొకటి లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సవాలు ఉగ్రవాదమేనని.. ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకోవటమే కాదు.. పెద్దఎత్తున ఆర్థిక నష్టానికీ ఉగ్రవాదం కారణమని.. మన జీవన విధానానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై ప్రపంచం ఉమ్మడిగా స్పందించాలన్నారు.

ఓపక్క జీ20 దేశాల సదస్సుతో పాటు.. బ్రిక్స్ దేశాల సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం బ్రిక్స్ కు రష్యా నేతృత్వం వహిస్తుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్ నేతృత్వం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాడటమే బ్రిక్స్ ఏకైక లక్ష్యం కావాలని.. దానికే తాము పెద్దపీట వేస్తామని మోడీ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి.. భూతాపం తదితర అంశాల మీద చర్చించాల్సిన జీ20 వేదిక.. తాజాగా ప్యారిస్ లో చోటు చేసుకున్న ఉగ్రవాదదాడి నేపథ్యంలో.. ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చించనుంది. మరోవైపు.. ఉగ్రవాద నిరోధానికి అతి త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయటంతో పాటు.. సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ స్పష్టం చేశారు. ఐసిస్ ను ప్రపంచం మీద లేకుండా చేస్తామంటూ చెప్పిన జీ20 దేశాలు.. ఆచరణలో అదెంత వరకూ పూర్తి చేస్తారో చూడాలి.