Begin typing your search above and press return to search.

ఆ గట్టున అన్న..ఈ గట్టున తమ్ముడు

By:  Tupaki Desk   |   15 Oct 2018 8:44 AM GMT
ఆ గట్టున అన్న..ఈ గట్టున తమ్ముడు
X
కాకా వెంకటస్వామి.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు.. ఒకసారి రాష్ట్రపతి అవకాశం వచ్చి తృటిలో చేజారిపోయింది. అలాంటి నేత కుమారులు కూడా ఆయన ఉన్నప్పుడు రాజకీయాలను ఏలారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ లో చేరారో వారికి కష్టాలు దాపురించాయి. తరగని ఆస్తిపాస్తులు - కోట్ల టర్నోవర్ల ఇండస్ట్రీలు - డబ్బు కొదవలేని ఫ్యామిలీకి ఇప్పుడు అడిగినన్నీ సీట్లు ఇవ్వలేమని టీఆర్ఎస్ స్పష్టం చేసిందట.. ఈ వైఖరి ఇద్దరు అన్నాదమ్ములు గడ్డం వివేక్ - వినోద్ మధ్య మనస్పర్థలకు, వివాదానికి దారితీస్లోందట. తమ్ముడు వివేక్ కు పెద్దపల్లి ఎంపీ సీటు ఖాయం చేసిన టీఆర్ఎస్ అన్న కోరిన చెన్నూర్ అసెంబ్లీ సీటును మాత్రం ఇవ్వడం లేదట.. తనకు ఎంపీ సీటు వద్దు చెన్నూర్ సీటు మా అన్న వినోద్ కు ఇవ్వాలని వివేక్ కోరినా కుదరదని కేటీఆర్ చెప్పేశాడట.. చెన్నూర్ టికెట్ ఎంపీ బాల్క సుమన్ కు ఇచ్చేశామని.. ఇప్పుడు మార్చడం కుదరదని కేటీఆర్ స్పష్టం చేయడంతో కాకా తనయుడు వినోద్ అంతర్మథనంలో పడ్డారు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి రెండు సార్లు వెళ్లివచ్చిన కాకా తనయుల్లో ఒకరైన మాజీ మంత్రి వినోద్, తిరిగి హస్తం గూటికి చేరుతారనే వార్తలు వెలువుడుతున్నాయి.. ప్రతీసారి వివేక్ - వినోద్ కలిసే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈసారి వినోద్ ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తుండగా.. వినోద్ కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఆ గట్టున అన్న వినోద్.. ఈ గట్టున తమ్ముడు వివేక్ ఉంటే జరగబోయే పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయాల్లో ఇప్పటివరకూ అన్నాదమ్ములు ఇద్దరూ కలిసే పార్టీలు మారారు. తాజాగా వినోద్ కాంగ్రెస్ లో చేరుతుండగా.. ఇకపై అన్నదమ్ములిద్దరి దారులు వేరు కానున్నాయి.

ఇప్పటికే వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున చేస్తుండగా.. తాను కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు వినోద్ అనుచరులు పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం వినోద్ కు చెన్నూర్, బెల్లంపల్లిలో ఎక్కడినుంచైనా టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటో తెలియక ఆ పార్టీలోని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.