Begin typing your search above and press return to search.

లీట‌రుకు మ‌రో రూ.5 వ‌డ్డించేందుకు సిద్ధ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   8 July 2019 5:10 AM GMT
లీట‌రుకు మ‌రో రూ.5 వ‌డ్డించేందుకు సిద్ధ‌మ‌ట‌!
X
మా మంచి మోడీ.. మావోడి పాల‌న‌లో దేశం అలా అయ్యింది.. ఇలా అయ్యింద‌ని గొప్ప‌లు చెప్పుకునే వారికి త‌న తాజా బ‌డ్జెట్ లో వ‌రం ఇవ్వ‌టం త‌ర్వాత‌.. నిత్య‌వ‌స‌ర వ‌స్తువైన పెట్రోల్.. డీజిల్ మీద లీట‌రుకు రూ.2 చొప్పున పెంచుతూ వాత పెట్టిన సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల‌కు ముందు తాముకానీ ప‌వ‌ర్లోకి వ‌స్తే.. లీట‌రు పెట్రోల్.. డీజిల్ రూ.50 కంటే త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేస్తామ‌ని.. భారీగా వేస్తున్న ప‌న్నుల భారం నుంచి త‌ప్పిస్తామంటూ సోష‌ల్ మీడియాలో చెప్పిన మాట‌లు అన్ని ఇన్ని కావు.

అయితే.. అలాంటివేమీ మోడీ-1లో చేయ‌ని కేంద్రం.. తన తాజా ట‌ర్మ్ లోనూ అలాంటివేమీ చేయ‌క‌పోగా.. కొత్త వాత పెట్టేందుకు రెఢీ అవుతున్న తీరు ఆందోళ‌న‌గా మారింద‌ని చెప్పాలి. బ‌డ్జెట్ లో లీట‌రుకు రూ.2చొప్పున పెంచుతున్న‌ట్లు చెప్ప‌గా.. ఆర్థిక బిల్లులో మాత్రం అందుకు భిన్నంగా లీట‌రుకు రూ.5 చొప్పున పెంచేస్తూ బిల్లును రూపొందించిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రో బాదుడు మ‌రింత భారీగా ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

తాజాగా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో పెట్రోల్.. డీజిల్ పై లీట‌ర్ కు అద‌నంగా ప్ర‌త్యేక అద‌న‌పు ప‌న్ను కింద రూపాయి.. ర‌హ‌దారులు.. మౌలిక వ‌స‌తుల సుంకం కింద మ‌రో రూపాయిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర ప‌న్నుల‌ను క‌లిపితే దీని మీద మ‌రో యాభై పైస‌ల వ‌ర‌కూ భారం ప‌డ‌నుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ‌డ్జెట్లో ప్ర‌స్తావించిన మాట‌కు.. ఆర్థిక బిల్లు వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి మాట మారింది. ఈ ప‌న్నును మ‌రింత పెంచే వీలుగా ప్ర‌భుత్వం ఒక అవ‌కాశాన్ని త‌న వ‌ద్ద ఉంచుకోవ‌టంతో రానున్న‌రోజుల్లో మ‌రింత భారాన్ని మోపటం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా అందుతున్న స‌మ‌చారం ప్ర‌కారం ప్ర‌త్యేక అద‌న‌పు ప‌న్ను పెట్రోల్ మీద రూ.8 వ‌ర‌కు.. డీజిల్ మీద రూ.2 వ‌ర‌కూ విధించేందుకు త‌న ద‌గ్గ‌ర ప్రొవిజ‌న్ ఉంచుకోవ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో పెట్రో భారం మ‌రింత పెరిగినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. అదే జ‌రిగితే.. పెట్రోల్.. డీజిల్ మీద లీట‌ర‌కు త‌క్కువ‌లో త‌క్కువ మ‌రో రూ.5 వ‌ర‌కూ పెరిగే వీలుందంటున్నారు. అయితే.. ఈ వాద‌న స‌రికాద‌ని రెవెన్యూ కార్య‌ద‌ర్శి అజ‌య్ భూష‌న్ పాండే అంటున్నారు. సీలింగ్ మాత్ర‌మే పెంచామ‌ని.. దాని అర్థం వెంట‌నే ధ‌ర‌లు పెంచ‌టం కాదంటున్నారు. సీలింగ్ పెంచే బ‌దులు ఎందుకు త‌గ్గించ‌రు? పెంచ‌టమంటే.. ఏదో రోజు భారం వేయాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ప్పుడే అలా చేస్తారు క‌దా? అన్న ప్ర‌శ్నకు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. చూస్తుంటే.. మోడీ మాష్టారు రానున్న రోజుల్లో భారీగా వాత‌లు పెట్టేందుకు డిసైడ్ అయిన‌ట్లుగా అనిపించ‌ట్లేదు?