Begin typing your search above and press return to search.

అప్పుడు నైట్ వాచ్ మెన్.. ఇప్పుడు ఐఐఎం ప్రొఫెసర్.. మధ్యలో ఏమైంది?

By:  Tupaki Desk   |   12 April 2021 10:03 AM IST
అప్పుడు నైట్ వాచ్ మెన్.. ఇప్పుడు ఐఐఎం ప్రొఫెసర్.. మధ్యలో ఏమైంది?
X
రీల్ కథ కాదు.. రియల్ స్టోరీ. విజయం అన్నది అనుకున్నంతనే వచ్చి ఒళ్లో పడదు. అందుకు కష్టంతో పాటు విపరీతమైన శ్రమ చేయాలి. అందుకు ఎంతో పట్టుదల అవసరం. అలాంటివన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే.. రంజిత్ రామచంద్రన్ వాచ్ మెన్ కాస్తా ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. వివరాలు తెలిసినంతనే వావ్ అనేలా ఉంటే అతడి జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఆయన రియల్ స్టోరీ చదివినవారంతా ఫిదా అవుతున్నారు. అర్జెంట్ గా ఆయనకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇంతకూ ఆయన ఎక్కడ ఉంటారు? ఈ స్థాయికి రావటానికి ఏమేం చేశారన్న విషయాల్లోకి వెళితే..

కేరళలోని కాసర్ గడ్ లోని పనతుర్ లో రంజిత్ నైట్ వాచ్ మెన్ గా పని చేసేవారు. ఓపక్క ఆ చిన్న ఉద్యోగం చేస్తూనే.. మరోపక్క తనకెంతో ఇష్టమైన విద్యను అభ్యసించేవారు. వాచ్ మెన్ గా పని చేస్తూనే.. పీఎస్ కాలేజ్ నుం చి ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. తన ప్రతిభతో మద్రాస్ ఐఐటీలో సీటును సొంతం చేసుకున్నారు.

ఇతగాడికి మలయాళం తప్పించి ఇంగ్లిషు రాకపోవటంతో చాలానే ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ఒకదశలో పీహెచ్ డీ వదిలేద్దామని అనుకున్నాడు కూడా. కానీ.. అనుకోని వరంలా ఆయనకు అండగా నిలిచారు గైడ్ కమ్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్. ఆయన సహకారంతో ఇంగ్లిషు సమస్యను అధిగమించటమే కాదు.. తన పీహెచ్ డీని విజయవంతంగా పూర్తి చేశారు.

అతడి కష్టానికి తగ్గట్లే తాజాగా ఆయనకు రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం లభించింది. రంజిత్ తండ్రి టైలర్ కాగా.. తల్లి ఉపాధిహామీ కూలీగా పని చేస్తుంటారు. కేరళలో తమ ఇంటిని పోస్టు చేశారు. కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్ తో కప్పిన చిన్న గుడిసె ఫోటోను ఆయన తన ఫేస్ బుక్ పోస్టుకు జత చేశారు. ఇతగాడి స్ఫూర్తివంతమైన జీవితం ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కుడా రంజింత్ గురించి తెలిసి.. సంతోషించటమే కాదు.. అతడికి అభినందనలు తెలియజేశారు. ఇతగాడి పోస్టు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.