Begin typing your search above and press return to search.

'కుప్పం సైకిల్‌'ను రిపేర్ చేయాలా..? నేటి నుంచి బాబు ప‌ర్య‌ట‌న‌

By:  Tupaki Desk   |   11 May 2022 9:38 AM GMT
కుప్పం సైకిల్‌ను రిపేర్ చేయాలా..?  నేటి నుంచి బాబు ప‌ర్య‌ట‌న‌
X
తన సొంత నియోజకవర్గమైన కుప్పం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నియోజకవర్గం లోని శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో పర్యటించి.. బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమం లో పాల్గొననున్నారు. రేపు సీగలాపల్లిలో జరగబోయే జాతరలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎల్లుండి కుప్పంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యి.. పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల పై సమీక్ష నిర్వహించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేయనున్న పర్యటనలో పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్య మిచ్చారు.

అయితే.. ప్ర‌స్తుతం వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యం లో టీడీపీని బాగు చేయాల‌ని.. నాయ‌కులు కోరుతున్నారు. దాడులు... ఆత్మహత్యలు... రోడ్డెక్కి నిరసన సమావేశాలు... అధికార పార్టీలో ఎన్నో లుకలుకలు. విద్యుత్తు కోతలు... సంక్షేమ పథ కాల రద్దు... ఠారెత్తిస్తున్న విద్యుత్తు బిల్లులు... ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత.... వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం లో టీడీపీ అధినాయ‌క‌త్వం ఉత్సాహంగా ఉన్నా, చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో మాత్రం నీరసంగా సాగుతోంది.

నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై చిన్నపాటి నిరసన తెలుపడానికి కూడా జంకిన టీడీపీ నాయక శ్రేణి, అధినేత చంద్రబాబు పిలుపుతో, ఆయనిచ్చిన ఉత్తేజంతో ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తోంది. అయితే కుప్పం నియోజక వర్గంలో మాత్రం అనుకున్నంతగా ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేక పోతోందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గం లో విద్యుత్తు కోతలు అపరిమితంగా ఉంటున్నా యి. కుప్పం, గుడుపల్లె మండలాల్లో రైతులే రోడ్డుమీదికి వచ్చి ఆయా సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేశారు.

వీరిలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ముందుగానే పసిగట్టడంలో స్థానిక టీడీపీ నాయకశ్రేణి విఫలమైంది. కనీసం రైతులు రోడ్డుమీదికి వచ్చాక కూడా ఎవరో ఒకరిద్దరు చోటా నాయకులు తప్ప వారి వద్దకెళ్లి పలకరించి, వారి సాధక బాధకాలు తెలుసుకుని వారి తరఫున పోరాడే తెగువ ప్రదర్శించలేకపోయారు. ఇక బాదుడే బాదుడు కార్యక్రమం కూడా మొక్కు బడిగానే ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీ వారు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలకు కనీసం కౌంటర్‌ ఇచ్చేవారు కూడా టీడీపీ లో కనిపించడం లేదు.

అధికార పార్టీ నుంచి టీడీపీ కార్యకర్తల పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు విషయం లోనూ బలంగా ప్రతిస్పందించడం లేదనే అసంతృప్తి కార్యక ర్తల్లో ఉంది. కుప్పం లో ఇటీవల ఒక కార్యకర్త పై ఇదే విధంగా దాడి జరిగింది. పోలీసు స్టేషన్‌ ఎదుట కాసేపు ఆందోళన చేసి, కేసు పెట్టి, తర్వాత ఎక్కడివారక్కడ గప్‌గుప్‌ అయి పోయారు. అదే విధంగా రామకుప్పం మండలంలో సైతం ఈమధ్య టీడీపీ కార్యకర్తల పై దాడి చేసిన సంఘటనలు రెండు మూడు జరిగాయి. ఆ విషయం లో కూడా పార్టీలో కదలిక లేదు. మొత్తంగా చూస్తే.. కుప్పం టీడీపీని రిపేర్ చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని.. ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నిస్తే.. త‌ప్ప‌.. పార్టీ మెరుగు ప‌డ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.