Begin typing your search above and press return to search.

ట్రెండింగ్...హైదరాబాద్‌లో ఎకో ఫ్రెండ్లీ ఫుడ్‌ జోన్

By:  Tupaki Desk   |   10 March 2020 8:00 AM IST
ట్రెండింగ్...హైదరాబాద్‌లో ఎకో ఫ్రెండ్లీ ఫుడ్‌ జోన్
X
రోడ్ పక్కన రద్దీగా ఉండే స్టాళ్లు...వాటి ముందు బారులు తీరిన జనం.....ఇరుకుగా పార్క్ చేసి ఉన్న బైకులు...హైదరాబాద్ లో చాలా చోట్ల ఇటువంటి ఫుడ్ కోర్టులు, ఫుడ్ స్టాళ్లు దర్శనమిస్తుంటాయి. ఇక హైటెక్ సిటీ, మాదాపుర్ వంటి జోన్లలో అయితే వీటికి మంచి గిరాకీ ఉంటుంది. అయితే, దాదాపుగా అన్ని స్టాళ్లలో పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు...కప్పులు, ప్లేట్లు...కనిపిస్తుంటాయి. అయితే, వీటన్నింటికి భిన్నంగా శిల్పారామం దగ్గర ఓ సరికొత్త ఫుడ్ స్టోర్ వెలసింది. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని విధంగా ఈ ఫుడ్ జోన్ ను జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసింది. రూ.50 లక్షల వ్యయంతో 50 స్టాళ్లున్న ఈ ఫుడ్ జోన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రెడ్ జోన్ అని పిలుస్తున్నన్న ఈ ఫుడ్ జోన్ ను GHMC అధికారులు ఏర్పాటు చేశారు. 50 స్టాళ్లు ఏర్పాటు చేసి వాటిని వ్యాపారులకు ఇచ్చారు. సోలార్ పవర్, నో ప్లాస్టిక్, షీ టాయిలెట్లు, స్టోన్‌ బెంచీలు, టేబుళ్లు ఇక్కడి ప్రత్యేకతలు. నీటిలో కరిగిపోయే గుణమున్న మొక్కజొన్న పిండితో చేసిన ప్లేట్స్, గ్లాసులు, స్పూన్‌లు, కంటెయినర్స్‌ ఇక్కడ లభిస్తాయి. కాటన్‌ బ్యాగ్స్, జ్యూట్‌ బాగ్స్, పేపర్‌ బ్యాగ్స్‌ లను మాత్రమే ఇక్కడ వాడతారు. ఈ స్టాళ్లలో హైదరాబాదీ, ఇండియన్, ఇటాలియన్, చైనీస్ వంటకాలు చేసేవారికి GHMC ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఫుడ్‌ జోన్ ఓపెన్ లో ఉంటుంది. ఒక్కో స్టాల్ మెయింటెనెన్స్‌ రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు, వాటర్ సప్లై GHMC చూసుకుంటుంది. ఇటువంటి ఫుడ్ జోన్లను మరిన్ని ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు. తెలంగాణలో ఈ తరహా ఫుడ్ జోన్ లలో ఇదే మొదటిదని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.