Begin typing your search above and press return to search.

తెల్లవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన లెక్కల మాస్టారు..!

By:  Tupaki Desk   |   13 Jan 2022 8:39 AM GMT
తెల్లవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన లెక్కల మాస్టారు..!
X
భరతమాతను తెల్లవారి కబంధహస్తాల నుంచి బయటపడేయడానికి ఎందరో మహానుభావులు అసువులు బాసారు. స్వేచ్ఛా భారతావని కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే వారిలో కొందరి పేర్లు మాత్రం చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు. బ్రిటీషు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఓ లెక్కల మాస్టారు కథ కూడా అలాంటిదే. బడిలో లెక్కలు చెప్పే ఆయన గురించి ఆంగ్లేయులు లెక్క తప్పారు. ఒక్కరోజులో బ్రిటీషువారి మిలిటరీని చిన్నాభిన్నం చేస్తాడని, వారి కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తాడని, వారి ఆయుధ సంపత్తిపై దాడి చేస్తాడని ఏ ఒక్క తెల్ల అధికారి కూడా ఆలోచించలేదు. ఈ విధంగా తెల్లవారిని హడలెత్తించిన ఆయనను చిట్టగాంగ్ మాస్టార్ దా అంటారు. ఆయనే ది గ్రేట్ సూర్యకుమార్ సేన్.. కాలగర్భంలో కలిసిపోయిన ఆయన చరిత్రను ఒక్కసారి తిరగేద్దామా...?


చిట్టగాంగ్ లో 1894లో ఆయన జన్మించారు. లెక్కల ఉపాధ్యాయుడిగా వృత్తి ప్రారంభించారు. అయితే చదువుకునే రోజుల్లోనే జాతీయోధ్యమం పట్ల ఆకర్షితుడు అయ్యారు. చిట్టగాంగ్ జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1916 నుంచి చిత్తరంజన్ దాస్ వంటి మహానుభావుల బాటల్లో నడుస్తూ... సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణల కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి తిరిగొచ్చాక ఆయనలో చైతన్యం వెల్లివిరిసింది. అంతేకాకుండా బంగాల్ లో కీలకంగా ఉన్న అనుశీలన సమితి పట్ల ప్రేరణ పొందారు. అనేక మంది యువతను పోగు చేశారు. యువకులందరూ కలిసి ఓ బ్యాచ్ లాగా మారి.... స్వాతంత్య్రం కోసం కంకణం కట్టుకున్నారు. బ్రిటీషు బానిస సంకెళ్లను కూకటివేళ్లతో పెగిలించాలని నిర్ణయించుకున్నారు.

ఈ యువకులంతా రిపబ్లిక్ ఆర్మీగా ఏర్పడ్డారు. ఆంగ్లేయులను ఓడించాలంటే ముందుగా వారి కమ్యూనికేషన్, ఆయుధ సంపత్తిపై పోరాడాాలని నిర్ణయించుకున్నారు. యువకులంతా కలిసి కొన్ని సమూహాలుగా విడిపోయారు. బ్రిటీషు వారి టెలిఫోన్, టెలిగ్రామ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. చిట్టగాంగ్ లోని వారి ఆయుధాగారంపై దాడి చేశారు. చాలా ఆయుధాలను నిర్వీర్యం చేశారు. కానీ మందుగుండు సామాగ్రిని కనిపెట్టలేకపోయారు. ఇక ఎక్కడివారు అక్కడ తప్పించుకుపోయారు. కాగా ఈ ఘటనలతో ఆంగ్లేయులు తీవ్ర కోపోద్రిక్తులు అయ్యారు. ఈ చర్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేట ముమ్మరం చేశారు. ఓ అడవిలో బ్రిటీషు పోలీసులకు తారసపడడంతో ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో 13 మంది సేన్ బృంద సభ్యులు చనిపోగా... 80 మంది పోలీసులు మరణించారు.

సేన్ మాత్రం సమీప గ్రామాల్లో తలదాచుకున్నారు. రోజుకో వేషం మారుస్తూ బ్రిటీషు వారి కళ్లు గప్పి తిరుగారు. కానీ తన సహచరుడైన నేత్ర సేన్ మోసంతో సూర్యసేన్ బ్రిటీషు వారికి చిక్కారు. ఫలితంగా ఆంగ్లేయులు ఆయనను చిత్రహింసలు పెట్టారు. వందేమాతరం అని పలకకుండా పళ్లను సుత్తెలతో కొట్టారు. ఎముకలను విరగొట్టారు. వేళ్లపై గోర్లను పీకేశారు. ఈ విధంగా ఆయనకు చిత్రహింసలు పెట్టిన తర్వాతే ఉరితీశారు. అయితే సేన్ పోరాటం మాత్రం ఆంగ్లేయులకు భయాన్ని పరిచయం చేసింది. అందుకే సేన్ దొరికిన తర్వాత ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో స్మారకాలు నిర్మించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సేన్ సేవలకు గుర్తుగా కొన్నింటిని నిర్మించింది.