Begin typing your search above and press return to search.

చెన్నై మెట్రో లో ఫ్రీ వైఫై.. హైదరాబాద్ మెట్రో మాటేమిటి ?

By:  Tupaki Desk   |   25 Nov 2019 5:38 AM GMT
చెన్నై మెట్రో లో ఫ్రీ వైఫై.. హైదరాబాద్ మెట్రో మాటేమిటి ?
X
దేశంలోనే అత్యుత్తమ సాంకేతికత తో నిర్వహిస్తున్న మెట్రో గా హైదరాబాద్ మెట్రో గురించి మన అధికారులు.. ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఉంటుంది. అయితే.. తరచూ సాంకేతిక సమస్యలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వైనం తెలిసిందే. మెట్రోను ప్రారంభించి దగ్గర దగ్గర రెండేళ్లు అవుతున్న వేళ.. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ.. టికెట్ల ధరలను తగ్గించే అంశం మొదలు.. సీజన్ పాసులు జారీ చేయటం లాంటివి ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు
మెట్రో ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఉచిత వైఫైను అందిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందన్న సూచన వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ ఆ దిశగా ఆలోచిస్తున్నదే లేదు. హైదరాబాద్ మెట్రో రైల్ సంగతి ఇలా ఉంటే.. చెన్నై మెట్రో వారు మాత్రం ప్రయాణికులకు ఉచిత వైఫైను అందుబాటులోకి తీసుకొచ్చారు.

డిసెంబరు నుంచి చెన్నై మెట్రోలో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. మెట్రో స్టేషన్ల లో ఉచిత వైఫై కు కనెక్ట్ కావొచ్చు. అంతేకాదు.. రైళ్లలో నూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాల్టి రోజున ప్రతి ఒక్కరి చేతి లో ఒక ఫోన్ కామన్ గా ఉండటం.. పలువురి చేతి లో రెండు ఫోన్లు ఉంటున్న వేళ.. వైఫై ఉంటే మరింత యూజ్ ఫుల్ గా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి.. ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటు లోకి తేనున్న వైఫై చెన్నై వాసులకు స్వీట్ న్యూస్ గా మారింది.

ఉచిత వైఫై ను పొందటానికి వీలుగా ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదంతా బాగుంది.. టెక్నికల్ గా మనమే ముందున్నామని గొప్పలు చెప్పే హైదరాబాద్ మెట్రో రైలు నిర్వాహకులు.. చెన్నైలో మాదరి హైదరాబాదీయుల కు ఉచిత వైఫై ను ఎప్పటి నుంచి అందుబాటులోకి తేనున్నారు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. మాటల్లో చూపించే గొప్పలు.. చేతల్లోనూ ప్రదర్శిస్తే బాగుంటుంది కదా?