Begin typing your search above and press return to search.

కేటీఆర్.. గుర్ గావ్ లో ఫ్రీవైఫైనంట

By:  Tupaki Desk   |   11 July 2016 9:37 AM GMT
కేటీఆర్.. గుర్ గావ్ లో ఫ్రీవైఫైనంట
X
అదేం చిత్రమో కానీ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూనే.. వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించక చతికిలపడటం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఒకరికి మించి మరొకరన్న చందంగా పోటాపోటీగా ప్రకటనలు చేసుకునే వారు. పథకాలు ప్రకటించేవారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉచిత వైఫై మీద భారీ ప్రకటనలే చేశారు మంత్రి కేటీఆర్.

ఇంకేముంది.. మరో మూడు.. నాలుగు నెలలు గడిచేసరికి.. హైదరాబాద్ నగరంలోని సింహభాగంలో ఉచిత వైఫై అంటూ ఊరించారు. అన్నట్లే.. ప్రయోగాత్మకంగా వైఫై సౌకర్యాన్ని స్టార్ట్ చేశారు కూడా. తర్వాత ఏమైందోకానీ.. ఆ ఊసే ఎత్తటం మానేశారు మంత్రి కేటీఆర్. స్వయంగా ఐటీ మంత్రి అయిన ఆయన.. హైదారాబాద్ ను వైఫై ఫ్రీ సిటీగా మార్చటాన్ని మర్చిపోయినట్లున్నారు. తాజాగా గుర్ గావ్ లో ఫ్రీ వైఫైను షురూ చేశారు. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఫ్రీవైఫై సౌకర్యం కల్పించినా.. రానున్న రోజుల్లో గుర్ గావ్ మొత్తంగా ఉచితంగా వైఫై ఇచ్చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఫ్రీ వైఫై సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో 30 నిమిషాలు ఉచితంగా వైఫై వాడుకోవచ్చని పేర్కొన్నారు. అరగంట తర్వాత మాత్రం మామూలు చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. హర్యానా కంటే ముందే మొదలెట్టిన తెలంగాణ సర్కారు.. వైఫై కార్యక్రమాన్ని మధ్యలో వదిలేయటం ఏమిటి కేటీఆర్? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనిపై ఆయన ఏం బదులిస్తారో..?