Begin typing your search above and press return to search.

అమరీందర్ సింగ్ హామీలు చూశారా?

By:  Tupaki Desk   |   8 Sep 2016 4:39 AM GMT
అమరీందర్ సింగ్ హామీలు చూశారా?
X
ఎన్నికల సమయం రావాలే కానీ.. రాజకీయ నాయకుల వరాలకు అడ్డే ఉండదు. నోటికి వచ్చింది వచ్చినట్లు ప్రజలకు చెప్పడం - అడిగినా అడగకున్నా వరాలు కురిపించడం వారికి సర్వసాధారణమైన విషయం. ప్రజల బలహీనతలే వారి బలం! ఈ విషయంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ తాజాగా ఒక కొత్త వాగ్ధానాన్ని ప్రజలకిచ్చారు. వినడానికి వింతగా ఉన్నట్లనిపించినా ఈ విషయం ఏమిటంటే... కాంగ్రెస్‌ కి ఓటేస్తే క్యాన్సర్ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పడం.

కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్ర ప్రజలకు క్యాన్సర్‌ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పుకొచ్చారు పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌. కొట్కపుర నియోజకవర్గంలో నిర్వహించిన "హల్కే విచ్‌ కెప్టెన్‌" (నియోజకవర్గంలో కెప్టెన్‌) కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వాగ్ధానం చేశారు. క్యాన్సర్‌ బారిన పడినవారికి సరైన చికిత్స అందక ఆత్మీయులను కోల్పోతున్నారని, అందుకే తాము అధికారంలోకి వస్తే క్యాన్సర్‌ రోగులకు ఉచిత వైద్యం అందజేస్తామని తెలిపారు. సరేలే.. పంజాబ్ కు ఇది ఆరోగ్య శ్రీ అనుకుంటే.. ఆ ఫ్లో కంటిన్యూ చేస్తూ, మరికొన్ని హామీలు ఇచ్చేశారు.

ఇదే క్రమంలో ఇప్పటివరకూ రైతు రుణమాఫీ అని ప్రకటించిన ఏ రాష్ట్రంలోనూ ఈ హామీ పూర్తిగా నెరవేరలేదనే విమర్శ ఉన్న నేపథ్యంలో... తాము అధికారంలోకి వస్తే రైతులు రుణాలన్నింటిని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేశారు. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయంలో సందేహాలు ఏమీ అక్కరలేదని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. అసలు ఏపనీ చేయకపోయినా, తిని పడుకున్నా కాలం నడిచిపోయేస్థాయిలో రాష్ట్ర ప్రజలకు అమరీందర్ ఒక వాగ్ధానం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ తో పాటు నాణ్యమైన గోధుమలు - చక్కెర - టీపొడి వంటి నిత్యావసరాలను కూడా ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.