Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్లు వేసుకుంటే బీరు, విందు, డబ్బు..

By:  Tupaki Desk   |   23 May 2021 5:30 PM GMT
వ్యాక్సిన్లు వేసుకుంటే బీరు, విందు, డబ్బు..
X
అగ్రరాజ్యంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనాలు బద్దకిస్తున్నారు. అమెరికా కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో తాయిళాలు ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది. మన భారత దేశంలో కరోనా వ్యాక్సిన్లు కోసం భారీ క్యూలు ప్రజలు కడుతుంటే.. అమెరికాలో మాత్రం బోలెడు వ్యాక్సిన్లు ఉన్నా అమెరికన్లు వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.

అందుకే అమెరికాలో అదిరిపోయే ఆఫర్లను అక్కడి ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఇస్తున్నాయి. బంపర్ ఫ్రైజులు ఇస్తున్నాయి. అమెరికాలో టీకా వేసుకుంటే బీర్, పెట్రోల్, సేవింగ్ బాండ్లు, ఎయిర్ లైన్స్ టికెట్స్, సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు ఇస్తున్నారు.

అమెరికాలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆ దేశంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది. ఏప్రిల్ రెండో వారంలో రోజుకు 32 లక్షల మంది టీకా వేసుకోగా.. చివరి వారానికి 25 లక్షలకు తగ్గింది. దీంతో రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి.

ఇక టీకా వేసుకున్నోళ్లకు కొన్ని బ్రూవరీల్లో ఫ్రీగా బీర్లు ఇస్తున్నాయి. డెట్రాయిట్ లో టీకా వేసుకుంటే 50 డాలర్లు ఇస్తున్నారు. సెలూన్ షాపుల్లో ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. వెస్ట్ వర్జీనియాలో 100 డాలర్లు విలువైన సేవింగ్ బాండ్స్ ఇస్తున్నారు. అలాస్కాలో కార్ప్ ప్రైజులతోపాటు ఎయిర్ లైన్స్ టికెట్లు ఇస్తున్నారు. సరుకులు కొనేందుకు 500 డాలర్లు, పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు.

ఫిలడెల్పియాలో కొన్ని కంపెనీలు 100-200 డాలర్లు ప్రోత్సాహకంగా ఇస్తున్నాయి. వ్యాక్సినేషన్ కు వెళ్లే వారిని ఉబర్ ఉచితంగా తీసుకెళ్లి ఇంట్లో దిగబెడుతోంది. న్యూజెర్సీలో వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి ఎంపిక చేసిన షాపుల్లో ఉచితంగా బీర్లు అందిస్తున్నారు.