Begin typing your search above and press return to search.

పంజాబ్ లో అందరికీ ఉచిత విద్యుత్ .. షరతులు విన్నారా?

By:  Tupaki Desk   |   17 April 2022 7:51 AM GMT
పంజాబ్ లో అందరికీ ఉచిత విద్యుత్ .. షరతులు విన్నారా?
X
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం ప్రజలందరికీ ఉచితంగా విద్యుత్ అందించాలని డిసైడ్ చేసినట్లు ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. అందరికీ ఉచితంగా ఇళ్ళకు విద్యుత్ ను అందించటం దేశంలోనే పంజాబ్ ప్రథమం. అయితే దీనికి కూడా ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది లేండి. అవేమిటంటే నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి మాత్రమే ఉచితం అని ప్రకటించారు.

బీసీలు, ఎస్సీలకు మాత్రం ఈ 300 యూనిట్ల సీలింగ్ అనేది లేదు. మిగిలిన వారికి మాత్రం ఈ సీలింగ్ కచ్చితంగా పాటించబోతున్నట్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా 300 యూనిట్లు దాటి వాడుకుంటే మాత్రం మొత్తం యూనిట్లకు బిల్లు కట్టాల్సిందే. అంటే దీనికి రెండు నెలలు అవకాశం ఇస్తారు. రెండు నెలలు కలిపి 600 యూనిట్లు దాటితే మొత్తం యూనిట్లకు బిల్లు కట్టాల్సిందే. 300 యూనిట్లు దాటిని యూనిట్లకు మాత్రమే కాదు బిల్లు చెల్లించాల్సింది. హోలుమొత్తం మీద అన్నీ యూనిట్లకూ బిల్లు కట్టాల్సిందే.

ఇప్పటికే ఎస్సీలు, బీసీలు, పేదరిక రేఖకు దిగువన ఉన్నారు, స్వాతంత్ర్య సమరయోధులు ప్రస్తుతం నెలకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా వాడుకుంటున్నారు. ఇకపై 100 యూనిట్లు అదనంగా అంటే 300 యూనిట్లకు పెంచారు. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 80 శాతం ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పరిశ్రమలు, కార్యాలయాలు, వర్తక, వ్యాపార వర్గాలకు మాత్రం యథావిధిగానే విద్యుత్ బిల్లులు చెల్లించక తప్పవు.

ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల ఒక ప్లస్సుంది మరో మైనస్సుంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ప్రభుత్వం ప్రకటించటం చాలా కీలకమైంది. ఎలాగంటే ఎలాగూ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం కాబట్టి వీలైనంతలో అందరు విద్యుత్ వాడకాన్ని 300 యూనిట్లు దాటకుండా చూసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వానికి చాలా విద్యుత్ ఆదా అవుతుంది. అలా ఆదా అయ్యే విద్యుత్ ను ప్రభుత్వం వ్యవసాయానికి, పరిశ్రమలు తదితర రంగాలకు మళ్ళించవచ్చు. ముఖ్యమంత్రి తాజా ప్రకటన ఏమేరకు సక్రమంగా అమలవుతుందో చూడాల్సిందే.