Begin typing your search above and press return to search.

మంత్రి కేటీఆర్ పేరుతో మోసం.. మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

By:  Tupaki Desk   |   17 Nov 2020 10:00 AM IST
మంత్రి కేటీఆర్ పేరుతో మోసం.. మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్
X
తెలంగాణలో ఇప్పుడు మంత్రి కేటీఆర్ కీరోల్. సీఎం కేసీఆర్ తర్వాత అంతటి పేరు పరపతి ఆయన సొంతం. అందుకే ఈ మధ్య కేటీఆర్ పేరు చెప్పి బయట కొందరు అక్రమార్కులు బాగా పనులు చేయించుకుంటున్నట్టు, డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసుల దృష్టిలో పడిందంట.. ఓ రంజి మాజీ ఆటగాడు కూడా ఇలా చేసి లక్షలు వసూలు చేసిన మోసం వెలుగుచూసింది.

మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు వరుస మోసాలు చేస్తున్నాడు. గత ఏడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఏకంగా రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు అడిగి పోలీసులకు చిక్కాడు.

తాజాగా ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన ఇతగాడు రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన ఫార్మా కంపెనీ ప్రతినిధులు దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.. నిందితుడిని బి.నాగరాజుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

బి.నాగరాజు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ రంజీ ఆటగాడు కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజుపై ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లోనూ ఏడు కేసులున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిని అంటూ మోసాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనూ అనేకమంది ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బీసీసీఐ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడినట్టు తేలింది.