Begin typing your search above and press return to search.

డిగ్గీ రాజా అల్లుడిపై చీటింగ్ కేసు!

By:  Tupaki Desk   |   18 Oct 2017 10:33 AM GMT
డిగ్గీ రాజా అల్లుడిపై చీటింగ్ కేసు!
X
బీజేపీ జాతీయాధ్య‌క్షుడు - గుజ‌రాత్ ఎంపీ అమిత్ షా కుమారుడు జ‌య్ షా పై కాంగ్రెస్‌ కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక జ‌య్ ఆదాయం 16000 రెట్లు పెరిగింద‌ని కాంగ్రెస్ స‌హా ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విష‌యాల‌ను వెలుగులోకి తెచ్చిన ది వైర్ పై జ‌య్ ప‌రువు న‌ష్టం దావా కూడా వేశారు. ఈ వ్య‌వ‌హారంతో అధికార బీజేపీని ఇరుకున పెట్టాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అల్లుడి మీద బెంగళూరులో చెక్ బౌన్స్‌ కేసు నమోదైంది. ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని దిగ్విజ‌య్‌ అల్లుడు భవానీ సింగ్ త‌మ‌ను మోసం చేశారని బాలాజీ ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని చంద్రబాబు కేసు న‌మోదు చేశారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా దిగ్విజయ్ సింగ్ పని చేశారు. ఆ సందర్బంలో చంద్ర‌బాబుతో భవానీ సింగ్ భేటీ అయ్యారని తెలుస్తోంది.

గ‌తంలో డిగ్గీ రాజా ....కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ప‌ని చేశారు. త‌న మామ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి ఓ ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని ఆయ‌న అల్లుడు భవానీ సింగ్ తన దగ్గర రూ. 1.15 కోట్లు ముడుపులు తీసుకున్నారని బాలాజీ ఎలక్ట్రికల్స్ యజమాని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆ డ‌బ్బు తీసుకున్న కొన్నాళ్ల‌కు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా వేణుగోపాల్ ను ఏఐసీసీ నియ‌మించింది. ఆ త‌ర్వాత బెంగుళూరులో భ‌వానీని చూడ‌లేద‌ని చంద్రబాబు అన్నారు. ఆ త‌ర్వాత త‌న‌కు కాంట్రాక్టు రాలేద‌ని వాపోయారు. తాను ఇచ్చిన డ‌బ్బులు తిరిగి చెల్లించాలని భవానీ సింగ్ కు చాలా సార్లు మనవి చేశానన్నారు. తీవ్రంగా ఒత్తిడి చేసిన అనంత‌రం ఆయన రూ. 25 - రూ. 35 - రూ. 55 లక్షల చెక్ లను త‌మ‌కు ఇచ్చారని తెలిపారు. అయితే, ఆ మూడు చెక్ లు బౌన్స్ అయ్యాయని చంద్రబాబు చెప్పారు. దీంతో, గ‌త్యంత‌రం లేక బెంగళూరులోని 22వ ఏసీఎంఎం న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాన‌న్నారు. ఈ చెక్ బౌన్స్ కేసులో భ‌వానీకి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. వాటిపై ఆయ‌న స్పందించాల్సి ఉంది. ఈ కేసుతో కాంగ్రెస్ పార్టీ ఇర‌కాటంలో ప‌డిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.