Begin typing your search above and press return to search.

హైదరాబాద్​లో ఐపీఎల్​ పెట్టడానికి ఇబ్బందేంటి? సన్​రైజర్స్ సహా మూడు ప్రాంచైజీల అసంతృప్తి..! ​..!

By:  Tupaki Desk   |   3 March 2021 12:30 AM GMT
హైదరాబాద్​లో ఐపీఎల్​ పెట్టడానికి ఇబ్బందేంటి?  సన్​రైజర్స్ సహా మూడు ప్రాంచైజీల అసంతృప్తి..!  ​..!
X
ఐపీఎల్​ 2021 టోర్నీ నిర్వహణకు తేదీలు ఖరారైన విషయం తెలిసిందే. ఏప్రిల్​ 11 నుంచి జూన్​ 6 వరకు ఐపీఎల్​ పండగ మొదలుకాబోతున్నది. అయితే ఐపీఎల్​ ఖరారు చేసిన వేదికలపై కొన్ని ప్రాంచైజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, కోల్​కతా, ఢిల్లీ, అహ్మదాబాద్​, ముంబైలో ఐపీఎల్​ నిర్వహించడానికి బీసీసీఐ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే బీసీసీఐ తీరును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.ఈ సారి ​ హైదరాబాద్​ లో ఐపీఎల్ కచ్చితంగా నిర్వహించి తీరాల్సిందేనంటూ సన్​ రైజర్స్​ హైదరాబాద్​ డిమాండ్​ చేస్తున్నది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఐపీఎల్ 2020ని యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి మనదేశంలోనే ఐపీఎల్​ను నిర్వహిస్తున్నారు. అయితే ఐపీఎల్​ నిర్ణయించిన వేదికలమీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఐపీఎల్​ వేదికలు జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎందుకంటే సొంత గడ్డమీద జట్టుకు విజయావకాశాలు ఎక్కువ గా ఉంటాయి. అంతేకాక ఆయా ప్రాంచైజీలకు వ్యాపారపరంగా కూడా ఇది కలిసి వస్తుంది. కానీ బీసీసీఐ నిర్ణయం తో .. బెంగళూరు, చెన్నై, కోల్​కతా, ఢిల్లీ, ముంబై జట్లకు లాభం చేకూరుతుంది.. మిగతా జట్లు ఆ మేరకు నష్ట పోతాయి’ అంటూ ఓ ప్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కరోనా, ఎన్నికలు తదితర కారణాలతో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని అధికారులు అంటున్నారు. మరో వైపు హైదరాబాద్‌ లో ఐపీఎల్​ నిర్వహించాల్సిదేనంటూ సన్ ​రైజర్స్​ హైదరాబాద్​ ప్రాంచైజీ లు గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు వాళ్లు బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమిన్‌ దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. వేదికల విషయం లో బీసీసీఐ మాత్రం బుజ్జగించే పనిలో పడిందని సమాచారం. కరోనా పరిస్థితుల దృష్ట్యా తాము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఫ్రాంచైజీలకు చెప్తోంది. గత ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ప్రాంచైజీల ఒత్తిడికి తలొగ్గి వేదికలు మారుస్తారో? లేక ఇవే కొనసాగిస్తారో? వేచి చూడాలి.