Begin typing your search above and press return to search.

ఫోర్త్ వేవ్ కలకలం.. దేశంలోని ఆ 4 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు

By:  Tupaki Desk   |   14 Jun 2022 2:48 AM GMT
ఫోర్త్ వేవ్ కలకలం.. దేశంలోని ఆ 4 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు
X
ఒకటి.. రెండు.. మూడు.. ఇదేమీ నారాయణ.. శ్రీ చైతన్య ర్యాంకుల ప్రకటన ఎంత మాత్రం కాదు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి భారత్ ను కమ్మేయనుందా? ఇప్పటికే మూడు వేవ్ ల్ని చూసిన దేశం.. ఇప్పుడు నాలుగో వేవ్ కు సిద్ధం కావాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు అసలు ప్రశ్న. మొన్నటివరకు కనీసం అన్నట్లుగా కూడా లేని కేసుల స్థానే.. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోనూ.. పలు ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇదంతా చూస్తుంటే.. నాలుగో వేవ్ మొదలైందా? అన్న సందేహం కలుగక మానదు.

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర.. కేరళ.. ఢిల్లీ.. కర్ణాటక) ఒక్కసారిగా పెరుగుతున్న కేసుల్ని చూస్తే.. మనం నాలుగో వేవ్ లోకి అడుగుపెట్టిన భావన కలుగక మానదు. ఇదే విషయాన్ని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు.. నాలుగు రోజుల్లో నమోదైన కేసుల్లో అత్యధికం (81 శాతం) నాలుగు రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికల్ని జారీ చేసింది కేంద్రం.

కోవిడ్ పరీక్షల్ని పెంచటంతో పాటు.. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇంతకూ ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఏ వేరియంట్ కు చెందినవన్న సందేహానికి సమాధానం వెతికితే.. వైద్య నిపుణుల మాట ప్రకారం బీఏ2 సబ్ వేరియంట్ గా చెబుతున్నారు.

మూడో వేవ్ లో ఏ వేరియంట్ అయితే పెద్ద ఎత్తున కేసులకు కారణమైందో.. ఇప్పుడు అదే వేరియంట్ విస్తరిస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు బీఏ.2.12.1 అనే సబ్ వేరియంట్ కూడా అమెరికాలో బయటపడిందని.. గతంలోని ఒమిక్రాన్ కంటే ఇది 25 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని చెబుతున్నారు.

ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. గతంలో ఒమిక్రాన్ తో ఇబ్బందికి గురైన వారు.. తాజా సబ్ వేరియంట్ తో మరోసారి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా సెకండ్ వేవ్ లో మాదిరి న్యూమోనియా.. ఒక్కసారిగా ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవటం.. ఐసీయూలో చేర్చటం వంటి సీరియస్ సమస్యలు లేకపోవటం ఊరట కలిగించే అంశంగా చెప్పాలి.

తాజాగా పాజిటివ్ అయ్యే వారిలో ఎక్కువగా గొంతు నొప్పి.. ఒళ్లు నొప్పులు.. హైఫీవర్.. డయోరియా లాంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లక్షణాలు.. కడుపు ఉబ్బరం.. మలబద్ధకం లాంటి సమస్యలతో వస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో ప్రయాణించి వచ్చిన వారే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.