Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా గాంధీజీ హ‌త్య‌లో కొత్త కోణం

By:  Tupaki Desk   |   8 Oct 2017 6:00 AM GMT
సంచ‌ల‌నంగా గాంధీజీ హ‌త్య‌లో కొత్త కోణం
X
70 ఏళ్ల క్రితం జ‌రిగిన దారుణం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. జాతిపిత మ‌హాత్మ‌గాంధీపై బుల్లెట్లు కురిపించిన వైనం.. అశేష భార‌తావ‌ని మూగ‌బోయేలా చేసింది. మ‌హాత్ముడి హ‌త్య‌కు గాడ్సే కార‌ణ‌మ‌ని అంద‌రికి తెలిసిందే అయినా.. తెలియ‌ని కొత్త కోణం స‌రికొత్త‌గా బ‌య‌ట‌కు వచ్చి కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. జాతిపిత‌ను చంపింది గాడ్సేతో పాటు వేరే హంత‌కుడు కూడా ఉన్నాడంటూ అభిన‌వ్ భార‌త్ సంస్థ ట్ర‌స్ట్రీ డాక్ట‌ర్ పంక‌జ్ ఫ‌డ్న‌వీస్ సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యం కొత్త క‌ల‌క‌లంగా మారింది.

అయితే.. ఈ కేసును విచార‌ణ‌కు స్వీక‌రించొచ్చా? లేదా? అన్నది తేల్చ‌టానికి సుప్రీంకోర్టు అమ‌రేంద్ర శ‌ర‌ణ్ అనే న్యాయ‌వాదిని అమిక‌స్ క్యూరీగా నియ‌మించింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదికను స‌మ‌ర్పించాల్సిందిగా ఆదేశించింది.

గాంధీజీపై మూడుసార్లు గాడ్సే తుపాకీతో కాల్పులు జర‌ప‌టం.. మ‌హాత్ముడు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూల‌టం.. హే రామ్ అంటూ ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన చివ‌రి వ్యాక్యాలుగా చెబుతారు. బాపూజీ శ‌రీరంలో నాలుగు బుల్లెట్లు వ‌చ్చిన‌ట్లుగా త‌ర్వాతి రోజు ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. అయితే.. మ‌హాత్ముడి మునిమ‌న‌మ‌రాలు మ‌నూ మాత్రం త‌న డైరీలో ఆయ‌న పంచె.. శాలువా.. చేతి రుమాలు ర‌క్తంతో త‌డిచిపోయాయి. ఆ దుస్తుల్లో నుంచి ఒక బుల్లెట్ బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. గాడ్సే మూడు సార్లు మాత్ర‌మే కాల్చార‌న్న‌ది ఒక వాద‌నైతే.. మ‌రి.. గాంధీజీ శ‌రీరంలో నుంచి నాలుగో బుల్లెట్ ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌న్న‌ది మ‌రో సందేహం.

ఇదిలా ఉంటే.. గాంధీని హ‌త‌మార్చిన తుపాకీ లెక్క మీద కూడా సందేహాలు ఉన్నాయి. గాడ్సే కాల్చిన తుపాకీ రిజిస్ట్రేష‌న్ నెంబ‌రు 606824. బిరెట్టా పిస్ట‌ల్‌.. గాల్వియ‌ర్‌ కు చెందిన డాక్ట‌ర్ ద‌త్తాత్రేయ ప‌ర్చురేదిగా చెప్పారు. అయితే.. గాంధీ హ‌త్య త‌ర్వాత ద‌త్తాత్రేయ ద‌గ్గ‌ర వేరే తుపాకీ ఉంది. దీంతో రికార్డులు ప‌రిశీలిస్తే.. అదే రిజిస్ట్రేష‌న్ నెంబ‌రు మీద ఉద‌య్ చాంద్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర కూడా తుపాకీ ఉన్న‌ట్లుగా న‌మోదైంది. అయితే.. ఈ విష‌యం మీద అప్ప‌టి పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌లేదు. కేవ‌లం వివ‌రాలు న‌మోదు చేసి వ‌దిలేశారు.

ఈ ఉదంతంపై మ‌రింత సందేహానికి కార‌ణం మ‌రో అంశం కూడా ఉంది. అదేమంటే.. 1948 మే ఆరున ఢిల్లీ పోలీసు ఐజీ.. ఈస్ట్ పంజాబ్ సీఐడీకి చెందిన సైంటిఫిక్ లేబ‌రేట‌రీ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు. లేఖ‌తో పాటు అత‌డు వాడిన కొన్ని బుల్లెట్లు పంపారు. పోలీసులు గాంధీ హ‌త్య త‌ర్వాత గ్వాలియ‌ర్ లో ద‌త్తాత్రేయ వ‌ద్ద వాడిన కొన్ని బుల్లెట్లు క‌నుగొన్నారు. అవి గాడ్సే కాల్చిన తుపాకీ నుంచి వ‌చ్చిన‌వా? కాదా? అన్న విష‌యాన్ని కోరితే.. అవి గాడ్సే తుపాకీ నుంచి కాల్చిన‌వి కావ‌న్న విష‌యాన్ని లేబ‌రేట‌రీ నుంచి స‌మాధానం వ‌చ్చింది.

ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీ లోని నేష‌న‌ల్ మ్యూజియంలో ఉన్న తుపాకీ.. గాంధీజీ శాలువాల‌ను ప‌రిశీలిస్తే ఎన్ని బుల్లెట్లు కాల్చార‌న్న‌ది తేలిపోతుంద‌ని.. అందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించాల‌ని కోరుతున్నారు.

గాంధీ హ‌త్య‌పై ఫ‌డ్న‌వీస్ వాద‌న ఏమిట‌న్న‌ది చూస్తే.. గాంధీపై కాల్పులు జ‌రిపిన‌ప్పుడు ఢిల్లీలోని అమెరిక‌న్ ఎంబ‌సీలో ప‌ని చేస్తున్న వైస్ కౌన్సిల్ హెర్ బ‌ర్ట్ టామ్ రిన‌ర్ అక్క‌డే ఉన్నార‌ని.. ఆయ‌నే గాడ్సే చేతిలో తుపాకీని లాక్కుని పోలీసుల‌కు అప్ప‌గించార‌ని చెప్పారు. ఆయ‌న ఎంబ‌సీకి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత అమెరికా విదేశీ మంత్రిత్వ‌శాఖ‌లోని త‌న‌పై అధికారుల‌కు టెలిగ్రాం పంపారు. రిన‌ర్ నివేదిక‌నుకానీ ఆయ‌న టెలిగ్రాంను కానీ ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌పెట్ట‌లేదని చెబుతున్నారు.

1948 ఫిబ్ర‌వ‌రిలో గాంధీజీ పాక్‌ కు వెళ్లాల‌నుకున్నార‌ని.. అందుకు జిన్నా అనుమ‌తి ఇచ్చార‌ని.. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవ‌టానికే గాంధీజీని హ‌త్య చేశార‌న్న‌ది ఫ‌డ్న‌వీస్ వాద‌న‌. గాంధీజీ హ‌త్య స‌మ‌యంలో విజ‌య‌ల‌క్ష్మీ పండిట్ ర‌ష్యాలో భార‌తీయ రాయ‌బారిగా వ్య‌వ‌హ‌రించేవారు. అప్ప‌ట్లో ఆమె గాంధీజీ హ‌త్య‌లో బ్రిట‌న్ పాత్ర ఉంద‌ని ఆరోపించారు. ఫ‌డ్న‌వీస్ ఇప్పుడు ఆ అంశాన్ని త‌న పిటీష‌న్ లో పేర్కొన‌టం గ‌మ‌నార్హం.