Begin typing your search above and press return to search.

టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేల షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   27 Oct 2019 7:42 AM GMT
టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేల షాక్ తప్పదా?
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుఫాన్ లో కొట్టుకుపోయి కేవలం 23 సీట్లకే పరిమితమైంది టీడీపీ. ఇక జగన్ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడంతో ఇప్పుడు బతికి బట్టకడుతోంది. రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటానని జగన్ ఫిరాయింపులకు దూరంగా పట్టుదలతో ఉండడంతో టీడీపీ నుంచి వలసలు ఆగిపోయాయి.

అయితే టీడీపీ అధినేత వ్యవహారశైలి.. ఇక ఆ పార్టీ భవిష్యత్ లో కూడా పుంజుకునే అవకాశాలు లేకపోవడం.. టీడీపీలో నైరాశ్యం చూసి వైసీపీలోకి చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకి చెందిన నలుగురు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు రాబోయే రెండు నెలల్లోనే పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.

ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జంపింగ్ జంపాంగ్ ఆలపిస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే చెందిన కరణం బలరామకృష్ణమూర్తి, కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ఈ మేరకు సీరియస్ గా ప్రత్యామ్మాయాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారు ఏ క్షణమైన టీడీపీని వీడవచ్చనే ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఈనెల 25న ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనకుండా దూరంగా ఉండడం దుమారం రేపింది. జిల్లాలోనే అందుబాటులో ఉన్నప్పటికీ ఎవరూ ప్రకాశం జిల్లాలో నిరసనల్లో పాల్గొనకపోవడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరిచింది.

ఈ నలుగరిలో గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి చెందిన వారే. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై 2016లో టీడీపీలో చేరిపోయాడు. ఇప్పుడు తన మాతృపార్టీలోకి తిరిగి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. తన పాత పరిచయాలను ఉపయోగిస్తున్నాడట..

ఇక పర్చూరు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సాంబశివరావు కూడా తన ప్రత్యర్థి, వైసీపీ పర్చూర్ ఇన్ చార్జి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి వైదొలిగితే ఆ పార్టీలో చేరాలని ఎదురుచూస్తున్నాడట..

ఇక వీరే కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధ రాఘవరావు - దామచర్ల జనర్ధాన్ లాంటి బలమైన టీడీపీ నేతలు కూడా టీడీపీలో యాక్టివ్ గా లేరు. వీరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.