Begin typing your search above and press return to search.

వైసీపీ కిట‌క‌ట‌!... ఒకే రోజు న‌లుగురు చేరిక‌!

By:  Tupaki Desk   |   8 March 2019 12:14 PM GMT
వైసీపీ కిట‌క‌ట‌!... ఒకే రోజు న‌లుగురు చేరిక‌!
X
ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ... విప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌ల జోరు పెరిగింది. ఇప్ప‌టికే టీడీపీకి షాకిస్తూ ఇద్ద‌రు ఎంపీలు - న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోతే... దాదాపుగా అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులంతా ఇప్పుడు వైసీపీలో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఐదేళ్లుగా సాగిస్తున్న పాల‌న నచ్చ‌క‌నే వీరంతా ఇప్పుడు టీడీపీకి ఏకైక ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్న వైసీపీ వైపు చూస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. టీడీపీకి ఆర్థికంగా వెన్నుద‌న్నుగా నిలిచిన వారంతా కూడా ఇప్పుడు ఒక్క‌రొక్క‌రుగా వైసీపీలో చేరుతున్న వైనం చూస్తుంటే.. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ చేతులెత్తేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ లండ‌న్ టూర్‌ కు ముందు వ‌స‌లు ఒక్క‌సారిగా ఊపందుకోగా... జ‌గ‌న్ లండ‌న్‌ లో ఉన్న వారంలో కాస్తంత జోరు త‌గ్గినా... జ‌గ‌న్ రాగానే వైసీపీలో చేరనున్న‌ట్లు చాలా మంది నేత‌లు ప్ర‌క‌టించారు. తాజాగా జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకుని రావ‌డం - రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన టీడీపీ నేతలంతా వైసీపీలోకి క్యూ క‌డుతున్నారు.

ఈ రోజు ఉద‌యం నుంచి లోట‌స్ పాండ్ కేంద్రంగా వ‌ల‌స‌లు జోరుగా సాగాయి. ఈ రోజు ఒక్క‌రోజే... న‌లుగురు ప్ర‌ముఖులు వైసీపీలో చేరిపోయారు. ఉద‌యం నుంచే మొద‌లైన వ‌ల‌స‌లు సాయంత్రం దాకా విడ‌త‌ల‌వారీగా జ‌రిగాయి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌ముఖులందరికీ స్వ‌యంగా పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఇక నేడు వైసీపీలోకి ఎవ‌రెవ‌రు చేరార‌న్న విష‌యానికి వ‌స్తే... నేటి ఉద‌యం తెల్లారిన వెంట‌నే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, విజ‌య్ ఎలక్ట్రిక‌ల్స్ అధినేత దాస‌రి జై ర‌మేశ్ సోద‌రుడు, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే దాస‌రి వెంక‌ట బాల‌వర్ధ‌న్ రావు వైసీపీలో చేరిపోయారు. సోద‌రుడు దాస‌రి జై ర‌మేశ్ ను వెంట‌బెట్టుకుని వ‌చ్చిన బాల‌వ‌ర్ధ‌న్ రావు... కృష్ణా జిల్లాలో వైసీపీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బాల‌వ‌ర్ధ‌న్ రావు చేరిక‌తో కృష్ణా జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

అనంత‌రం లోట‌స్ పాండ్‌కు వ‌చ్చిన కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఇటీవ‌లే రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసిన చల్లా రామ‌కృష్ణారెడ్డి వైసీపీలో చేరిపోయారు. జిల్లాలోని బ‌న‌గాన‌ప‌ల్లి ప‌రిధిలో మంచి ప‌ట్టున్న నేత‌గా పేరున్న చ‌ల్లా... టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేర‌డంతో జిల్లాలో పార్టీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్టేనని చెప్పాలి. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోనే ఉన్న చ‌ల్లా... ఆ ఎన్నిక‌ల్లో బ‌న‌గాన‌ప‌ల్లి టికెట్ ఆశించారు. అయితే వివిధ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో నాడు చ‌ల్లాకు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో టీడీపీలో చేరిన చ‌ల్లా... అక్క‌డ చంద్ర‌బాబు వైఖ‌రితో బాగానే విసిగిపోయార‌ని చెప్పాలి. ఎన్నిక‌లు వ‌చ్చేదాకా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా ఉండి... స‌రిగ్గా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌స‌మ‌యంలో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి తెర తీసిన చంద్రబాబు... చ‌ల్లాకు సివిల్ సప్లైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆ ప‌ద‌విని తీసుకునేందుకు తాను స‌సేమిరా అన్నాన‌ని, పార్టీ అధినేత హోదాలో చంద్ర‌బాబు బ‌తిమాలితేనే ఆ ప‌దవి తీసుకున్నాన‌ని చ‌ల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయినా చంద్ర‌బాబు మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి కాద‌ని, అందుకే ఓ సారి మాట ఇస్తే దానికి కట్టుబ‌డి ముందుకు సాగుతున్న జ‌గ‌న్ వ‌ద్ద‌కే తిరిగి వ‌చ్చాన‌ని చ‌ల్లా చెప్పుకొచ్చారు.

ఇక ఇదే జిల్లాకు చెందిన ప్ర‌ముఖ వ్యాపారి పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి కూడా నేడు వైసీపీలో చేరిపోయారు. నంద్యాల కేంద్రంగా మంచి బిజినెస్ మ్యాన్‌గా పేరున్న పోచా... చాలా కాలంగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో నేడు లోట‌స్ పాండ్‌కు వ‌చ్చిన ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నంద్యాల ఎంపీ సీటును ఆయ‌న ఆశిస్తున్న‌ట్టుగా స‌మాచారం. పోచా చేరిక‌తో నంద్యాల ప‌రిధిలో వైసీపీకి మరింత బ‌లం చేరిన‌ట్టేన‌న్న వాద‌న లేక‌పోలేదు. ఆ త‌ర్వాత లోట‌స్ పాండ్ వ‌ద్ద సినీ ప్ర‌ముఖుడు, కమెడియ‌న్ జోగి నాయుడు కూడా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇప్ప‌టికే వైసీపీలో కీల‌క పాత్ర పోషిస్తున్న క‌మెడియ‌న్, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పృథ్వీ, కృష్ణుడుల‌తో క‌లిసి వ‌చ్చిన జోగి నాయుడు వైసీపీలో చేరారు. జోగి నాయుడు వెంట సినీ రంగానికి చెందిన ప‌లువురు క‌ళాకారులు కూడా పెద్ద సంఖ్య‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా ఉద‌యం నుంచి సాయంత్రం దాకా విడ‌త‌ల‌వారీగా వ‌చ్చి పార్టీలో చేరుతున్న వారితో నేడంతా లోట‌స్ పాండ్ క‌ళ‌క‌ళ‌లాడింద‌నే చెప్పాలి.