Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పీఏ పేరును వాడేస్తూ మోసం చేస్తున్నోళ్లు అరెస్ట్‌!

By:  Tupaki Desk   |   28 July 2019 5:16 AM GMT
జ‌గ‌న్ పీఏ పేరును వాడేస్తూ మోసం చేస్తున్నోళ్లు అరెస్ట్‌!
X
ఎంత‌టి తెలివైనోడైనా.. త‌ప్పు చేస్తే దొర‌క్కుండా ఉండ‌రు. జ‌గ‌న్ పీఏ పేరుతో ప‌లువురికి టికెట్లు ఇప్పిస్తామంటూ టోక‌రా చేసే మోస‌గాళ్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రించే వేళ‌.. ఎన్నిక‌ల్లో టికెట్లు ఇప్పిస్తామంటూ న‌లుగురు మోస‌గాళ్లు (పండ‌రి విష్ణుమూర్తి.. త‌రుణ్.. జ‌గ‌దీష్.. జ‌య‌కృష్ణ‌) ప‌లువురిని మోస‌గించారు. విశాఖ‌కు చెందిన ఈ న‌లుగురు యువ‌కులు స్ఫూపింగ్ టెక్నాల‌జీని ఉప‌యోగించి వ‌సూళ్ల‌కు పాల్ప‌డేవారు.

జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు కె.నాగేశ్వ‌ర్ రెడ్డి అలియాస్ కేఎన్నార్ వాడే సెల్ ఫోన్ నంబ‌రును తెలుసుకున్నారు. స్ఫూపింగ్ ప‌ద్దతితో ఆయ‌న నెంబ‌రుతో ఆయ‌న పేరుతో ఫోన్లు చేసేవారు. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామ‌ని.. పార్టీ ఖ‌ర్చుల కోసం డ‌బ్బులు పంపాల్సిందిగా ప‌లువురు నేత‌ల‌కు ఫోన్లు చేసేవారు. కొన్ని సంద‌ర్భాల్లో జ‌గ‌న్ మాదిరి మాట్లాడేవారు. కొన్ని వాట్సాప్ నెంబ‌ర్ల‌కు చాటింగ్ చేసేవారు. స్ఫూపింగ్ టెక్నాల‌జీతో ప‌లువురితో మాట్లాడి మోసాల‌కు పాల్ప‌డేవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ ఎంపీ పూన‌మ్ మ‌హాజ‌న్ పేరు.. డిస్ ప్లే పిక్ ను వాడుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఈ మోసాన్ని గుర్తించ‌లేని ప‌లువురు లక్ష‌ల్లో డ‌బ్బులు చెల్లించారు. ఇదే తీరులో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒక నాయ‌కుడికి ఫోన్ చేసి రూ.10 ల‌క్ష‌లు పంపాల‌న్నారు. ఆయ‌న‌కు అనుమానం వ‌చ్చి.. నేరుగా కేఎన్నార్ కు ఫోన్ చేశారు. తాను అస‌లు ఫోనే చేయ‌లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో అనుమానం వ‌చ్చి సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అదే రీతిలో హైద‌రాబాద్ లో ఒక నాయ‌కుడికి ఫోన్ చేసి రూ.5ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌టం.. స‌ద‌రు నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్య‌ద‌ర్శి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

కేఎన్నార్ పేరుతో మోసం చేస్తున్న వైనం పార్టీ దృష్టికి రావ‌టంతో 2018 డిసెంబ‌రులో హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు మోసానికి పాల్ప‌డుతున్న న‌లుగురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైల్లో ఉన్న వీరిని పీటీ వారెంట్ ల‌పై హైద‌రాబాద్ కు తీసుకొచ్చారు. ఇదే త‌ర‌హా కేసులో వీరిని కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. నిందితుల‌పై వైజాగ్.. శ్రీ‌కాకుళం.. ముమ్మిడివ‌రంలోనూ కేసులు న‌మోద‌య్యాయి.