Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికల్లో ఇరగదీసిన మనోళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే

By:  Tupaki Desk   |   8 Nov 2019 7:28 AM GMT
అమెరికా ఎన్నికల్లో ఇరగదీసిన మనోళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే
X
అమెరికా లో ఎన్నికల్లో ప్రవాస భారతీయుల విజయకేతనం కొత్త కాకున్నా.. తాజాగా నలుగురు ప్రవాస భారతీయులు వివిధ స్థాయిలకు ఎన్నికకావటం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర స్థాయి ఎన్నిలకతో పాటు.. స్థానిక ఎన్నికల్లో నలుగురు ప్రవాస భారతీయులు ఎన్నికయ్యారు. వీరిలో ఒక ముస్లిం మహిళ కూడా ఉండటం విశేషమైతే.. ఆమె మూలాలు హైదరాబాద్ కు చెందినవి కావటం గమనార్హం.

ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే..

వర్జీనియా రాష్ట్ర సెనేట్ సభ్యురాలిగా గజాలా హష్మీ విజయం సాధించారు. ఆ రాష్ట్రంలో ఎన్నికైన తొలి ప్రవాస భారతీయురాలు ఆమే. అంతేకాదు.. ఆ రాష్ట్ర సెనేట్ కు ఎన్నికైన ప్రథమ ముస్లిం మహిళ కూడా ఆమె కావటం మరో విశేషం. ప్రొఫెసర్ గా పని చేసే ఆమె డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

ఇక.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు సాంకేతిక సలహాదారుగా వ్యవహరించిన సుహాన్ సుబ్రహ్మణ్యం.. వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వీరిద్దరే కాక.. శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్ గా మనో రాజు గెలవగా.. ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్ సిటీ కౌన్సిల్ కు డింపుల్ అజ్మీరా రెండో సారి ఎన్నికయ్యారు. ఇలా ఒకేసారి నలుగురు ప్రవాస భారతీయులు అమెరికా ఎన్నికల్లో తమ సత్తాను చాటటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

ఇక.. ఈ నలుగురి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన గజాలా ఫ్యామిలీ 50 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయింది. అమెరికాకు వెళ్లే నాటికి గజాలా చాలా చిన్నది. వారి కుటుంబం జార్జియాలో స్థిరపడింది. ఆమె ప్రాథమిక విద్య.. ఉన్నత విద్య అంతా అమెరికాలోనే సాగింది. పీహెచ్ డీ పూర్తి చేసిన ఆమె.. తర్వాత అజహర్ తో వివాహమైంది. భర్తతో కలిసి 1991లో రిచ్ మండ్ ప్రాంతానికి వెళ్లిన ఆమె పాతికేళ్లు విద్యావేత్తగా పని చేశారు. ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీ.. టీచింగ్ అండ్ లెర్నింగ్ ద సెంటర్ ఫర్ ఎక్స లెన్స్ లో ఫండింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
కాలుష్యం మీద పోరాడే విషయంలో మక్కువ ఉన్న ఆమె.. తాను అనుకున్నది సాధించాలంటే రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి రాజకీయ రంగంలోకి వచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగి డెమొక్రాటిక్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆమె విజయం పెను సంచలనంగా మారటమే కాదు.. భారీ చర్చకు తెర తీసింది.

సుహాన్ సుబ్రహ్మణ్యం
బెంగళూరుకు చెందిన వైద్యురాలైన కుమారుడు సుహాన్ సుబ్రహ్మణ్యం. 1979లో అమెరికాకు వచ్చి స్థిరపడిన ఆయన.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒబామాకు సలహాదారుగా ఉన్నారు. ఆరోగ్యం.. సీనియర్ సిటిజన్ల సంక్షేమం.. సాంకేతిక రంగాల్లో ఒబామాకు సలహాలు ఇచ్చారు. జాబ్ క్రియేషన్ తదిరత అంశాలపై ఒబామా ఏర్పాటు చేసిన జట్టు లో కీలకంగా వ్యవహరించారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే లౌడన్ అండ్ ప్రిన్స్ విలియం జిల్లా నుంచి ఆయన విజయం సాధించారు.

డింపుల్ అజ్మీరా
పేరెంట్స్ తో కలిసి పదహారేళ్ల వయసు లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అమెరికాకు వచ్చే సమయానికి ఆమెకు ఇంగ్లిషు సరిగా మాట్లాడటం రాదు. కానీ.. అలాంటి ఆమె యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చేరి పట్టుదలతో తన సత్తా చాటారు. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ గా పని చేసిన ఆమె.. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు.

మరో రాజు
కొలంబియా వర్సిటీ లో డిగ్రీ చేసిన ఆయన.. క్రిటికల్ రేస్ థియరీపై రీసెర్చ్ చేశారు. బెర్కలీ స్కూల్ ఆఫ్ లాలో న్యాయవాద పట్టా పొందిన ఆయన.. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫార్ ఆఫ్రికన్ స్టడీస్ స్కాలర్ షిప్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రం లో శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్ గా విజయం సాధించారు.