Begin typing your search above and press return to search.

ఇలాంటి ధనుంజయ్ ట్రావెల్స్ ను ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   15 March 2016 5:38 AM GMT
ఇలాంటి ధనుంజయ్ ట్రావెల్స్ ను ఏం చేయాలి?
X
పొరపాటున తప్పు జరగటం ఒక ఎత్తు. నిలువెత్తు నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలు తీయటం మరో ఎత్తు. తాజాగా చోటు చేసుకున్న ధనుంజయ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాద ఘటనలో యాజమాన్యం ఏమాత్రం స్పందించని కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ దారుణ ప్రమాదంలో నలుగురు మెడికోలు మరణించగా.. 31 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సైతం ఘటనాస్థలంలోనే మరణించాడు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన మాటల్ని చూస్తే.. ఈ ఘోరప్రమాదానికి ధనుంజయ ట్రావెల్స్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా చెప్పొచ్చు.

ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పిన మాటల్ని చూస్తే..

మద్యం మత్తులో డ్రైవర్ ఉండటాన్ని బస్సులోని ప్రయాణికులు గుర్తించారు. విజయవాడ సమీపంలో భోజనానికి బస్సును ఆపారు. ఆ సమయంలో విద్యార్థులు బస్సు దిగారు. విద్యార్థులకు చెందిన విలువైన సామాను పోయాయి. దీనిపై క్లీనర్ తో వాగ్వాదం జరిగింది. అప్పుడే మద్యం సేవించి వచ్చిన డ్రైవర్ ను బస్సు నడపొద్దని విద్యార్థులు కోరారు. వారు మాట వినకపోయేసరికి.. ఆ డ్రైవర్ ను తప్పించి.. మరో డ్రైవర్ ను నియమించాలన్న ప్రయాణికుల మాటను ధనుంజయ ట్రావెల్స్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు.

బస్సు ఎక్కిన విద్యార్థులతో క్లీనర్ వాగ్వాదానికి దిగటం.. బస్సు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలోనే.. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. బస్సును తక్షణమే నిలిపివేయాలని కోరినా పట్టించుకోకుండా వేగంగా బస్సును నడిపాడు. ఆ క్రమంలోనే డివైడర్ ను ఢీ కొన్న బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరుగుతుందని ఎంత మొత్తుకున్నా వినని డ్రైవర్.. ప్రమాదం గురించి భయపడిన విద్యార్థుల్లో నలుగురు చనిపోయారు. తప్పు చేసిన సిబ్బందిని మందలించి.. వెంటనే వారి స్థానంలో మరో డ్రైవర్ ను ఏర్పాటు చేయాల్సిన ధనుంజయ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారికి ఎలాంటి శిక్షను విధించాలి..?