Begin typing your search above and press return to search.

జీఎస్టీ తాజా అప్ డేట్స్ ను ఫాలో అయ్యారా?

By:  Tupaki Desk   |   4 Nov 2016 4:35 AM GMT
జీఎస్టీ తాజా అప్ డేట్స్ ను ఫాలో అయ్యారా?
X
వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని భావిస్తున్న జీఎస్టీ పన్నులకు సంబంధించి కీలక నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అమలు చేయనున్న జీఎస్టీ పన్నులకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని తాజాగా తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏ వస్తువు మీద ఎంత పన్ను విధిస్తారన్న అంశంపై ఉన్న గందరగోళానికి చెక్ చెబుతూ.. నాలుగు విభాగాలుగా పన్నుల రేట్లను సిద్ధం చేశారు. రెండు రోజులుగా సాగుతున్న కౌన్సిల్ సమావేశంలో సభ్యుల మధ్య తొలిరోజు పన్ను రేట్ల మీద ఏకాభిప్రాయం కుదర్లేదు. అందుకు భిన్నంగా రెండో రోజు పన్నుల విధానం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. పన్నుల రేట్లు నాలుగు విభాగాల్లో ఉండనున్నాయి. వాటి లెక్కల్ని చూస్తే..

మొదటి విభాగం

ఈ విభాగంలో ఉన్న వస్తువుల మీద వినియోగదారులకు ఎలాంటి పన్నులు విధించరు. కాకుంటే.. ఈ విభాగంలో చాలా తక్కువ వస్తువులు ఉండనున్నాయి. పన్నులు అనేవి లేకుండా ఉండే అంశాల విషయానికి వస్తే ఆహారధాన్యాలు.. పాలు.. కూరగాయలు.. పండ్లు.. గుడ్లు.. చికెన్.. మటన్ వంటి వస్తువులు ఉండనున్నాయి. వీటిపై ఎలాంటి పన్నులు విధించరు.

రెండో విభాగం

ఈ విభాగంలో పన్ను రేటు 5 శాతం ఉంటుంది. ఈ విభాగంలో వంట సామాగ్రితో పాటు మసాలా దినుసులు కూడా ఉండనున్నాయి

మూడో విభాగం

ఈ విభాగంలో పన్ను రేటు 12 శాతం నుంచి 18 శాతం వరకూ ఉండనున్నాయి.ఇందులో దిగువ మధ్య తరగతి జీవులు మొదలు సంపన్నులు సైతం వినియోగించే వస్తువులు భారీఎత్తున ఉండనున్నాయి. సబ్బులు.. షాంపూలు.. టూత్ పేస్ట్ లు.. స్టీల్.. సిమెంట్ తో పాటు వాషింగ్ మెషీన్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లు లాంటివి ఉండనున్నాయి.

నాలుగో విభాగం

ఈ విభాగంలో ఉండే వస్తువుల మీద కనిష్ఠంగా 28 శాతం నుంచి గరిష్ఠంగా 65 శాతం వరకూ పన్నులు బాదేస్తారు. ఇందులో లగ్జరీ కార్లు మొదలు.. శీతల పానీయాలు.. పొగాకు ఉత్పత్తులు.. పాన్ మసాలా ఉత్పత్తులు ఉండనున్నాయి. అయితే..లగ్జరీకార్లు తరహా కొన్ని వస్తువులపై 28 శాతం పన్నును విధించనున్నారు. పేరుకు 28 శాతం నుంచి 65 శాతం అని చెప్పినా.. చాలా వరకు వస్తువుల మీద పన్నును 28 శాతానికే పరిమితం చేయనున్నారు. ఇక.. దేశ ప్రజలు ఎక్కువగా వినియోగించే బంగారం మీద పన్ను ఎంత వేయాలన్నది డిసైడ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. జీఎస్టీ పన్ను విధానం ద్వారా రాష్ట్రాలు నష్టపోయే మొత్తాన్ని కేంద్రం భర్తీ చేయాల్సిన నేపథ్యంలో.. కొన్ని పన్నుల‌ మీద సెస్సుతో కలిపి భారీగా వడ్డించనున్నారు. అదే జరిగితే.. కొన్ని వస్తువులపై ముందుగా చెప్పిన పన్నుకు మరికొంత పన్ను రేటు అదనంగా పడటం ఖాయమని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/