Begin typing your search above and press return to search.

అలెర్ట్ : గురువారం నుంచి ఫోర్ డేస్

By:  Tupaki Desk   |   21 March 2016 7:30 PM GMT
అలెర్ట్ : గురువారం నుంచి ఫోర్ డేస్
X
కాస్త అలెర్ట్ గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. మారిన బ్యాంకింగ్ తీరుతో ఇంట్లో డబ్బులు ఉంచుకోవటం మానేసి.. అవసరమైనప్పుడు రోడ్డు పక్కనుండే ఏటీఎం డబ్బాలో నుంచి డబ్బులు తెచ్చుకునే అలవాటైన నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. గురువారం మొదలు ఆదివారం వరకూ బ్యాంకులు పని చేయని పరిస్థితి. ఒకట్రెండు రోజులు బ్యాంకులకు సెలవులు మామూలే అయినా.. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటం కాస్త అరుదు.

ఎప్పుడో కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. అయితే.. మరో రెండు రోజుల తర్వాత నుంచి వరుసగా నాలుగు రోజుల వరకూ బ్యాంకులు బంద్ కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. బ్యాంకు లాకర్ లో ఏదైనా విలువైన డాక్యుమెంట్లు దాచి పెట్టి.. రానున్న నాలుగు రోజుల్లో వాటితో పని పడితే ఇంక అంతే సంగతులు. అంతేకాదు..దొంగల భయంతో బ్యాంకు లాకర్లో బంగారు ఆభరణాలు దాచి ఉంచేవారు.. ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కాస్త ముందుజాగ్రత్తగా ఉంటే మంచిది.

ఇవేకాదు.. పెద్ద మొత్తాలు ఇచ్చేందుకు ఎవరితోనైనా కమిట్ మెంట్ ఉంటే.. బుధవారం నాటికి డ్రా చేసేయటం మంచిది. మొత్తంగా బ్యాంకులకు వెళ్లి పనులు చక్కబెట్టాలనుకునే వారంతా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. గురువారం హోలీ.. శుక్రవారం గుడ్ ఫ్రైడే.. శనివారం (వార్షిక చివరి శనివారం కావటంతో సెలవు).. ఆదివారం ఎప్పటి మాదిరే సెలవు దినం. దీంతో.. ఏటీఎంలలో కూడా డబ్బులు నిండుకునే ప్రమాదం ఉంది.

అయితే.. ఏటీఎం కష్టాలు లేకుండా చూసేందుకు ప్రత్యేకంగా మనీ ఫిల్లింగ్ చేస్తామన్న మాటను కొన్ని బ్యాంకులు చెబుతున్నాయి. అయినా.. ఎవరికి వారు ముందస్తుగా జాగ్రత్తగా ఉండాలే తప్పించి..ఆదమరిస్తే ఇబ్బందులు తప్పవు. మరో తెలివైన పని ఏమిటంటే.. రానున్న నాలుగు రోజుల్లో ఏదైనా కొనుగోలు చేసినా.. నగదు చెల్లించే కన్నా.. కార్డుతో వినియోగించటం మంచిదన్న విషయం మర్చిపోవద్దు. ఏది ఏమైనా.. గురువారం నుంచి ఆదివారం వరకూ బ్యాంకులు సెలవు అన్న విషయంపై అవగాహన చాలా అవసరం. లేకుంటే.. తిప్పలు తప్పనట్లే.