Begin typing your search above and press return to search.

సంచలనం: బీజేపీలోకి కేంద్రమాజీ మంత్రి?

By:  Tupaki Desk   |   28 Dec 2020 3:15 PM IST
సంచలనం: బీజేపీలోకి కేంద్రమాజీ మంత్రి?
X
దేశంలో ఇప్పుడు బీజేపీ వేవ్ నెలకొంది. ఎక్కడ చూసినా కమలదళంలోకి నేతల తాకిడి ఎక్కువైంది. తెలంగాణలో మొదలైన ఒరవడి ఇప్పుడు ఏపీకి పాకింది. ఏపీలోనూ బీజేపీ వైపు ఒకప్పటి కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఆకర్షితులు అవ్వడం ప్రారంభించారు.

ఏపీలోనూ బీజేపీ ఇప్పుడు క్రియాశీలం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో అటువైపు నేతలు వెళుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో భూస్థాపితమైంది. అయితే నాడు కాంగ్రెస్ కేంద్రమంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన నేతలంతా వేరే పార్టీలోకి వెళ్లకుండా చాలా మంది తమ వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఈ జంపింగ్ జపాంగ్ లు కొనసాగాయి. ఇప్పుడు మళ్లీ నేతల వలస మొదలైంది. టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు.

ఏపీలోని కడప జిల్లాలో మరింత బలోపేతం కావాలని బీజేపీ కూడా ఆపరేషన్ షురూ చేసింది. అధికార, విపక్ష పార్టీల్లో ఉండే అసంతృప్తులు, మాజీ మంత్రులను బీజేపీలోకి లాక్కునే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు.

ఇందులో భాగంగానే పలువురు మాజీలకు కాషాయ కండువాలను కప్పి సాధారంగా ఆహ్వానించాలని చూస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే రాజంపేటలో జరిగే బహిరంగ సభలో సాయిప్రతాప్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. సునీల్ ధియోదర్, సోము‌ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో సాయిప్రతాప్, అతని కుటుంబ సభ్యులు బీజేపీలో చేరనున్నారు.

సాయిప్రతాప్ పార్టీలోకి వస్తే జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని కడప కమలనాథులు భావిస్తున్నారు. అయితే ఈ చేరికపై ఇంతవరకూ సాయిప్రతాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు సాయిప్రతాప్ ఎంపీ, కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో లూప్ హోల్ లో ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.