Begin typing your search above and press return to search.

ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి!

By:  Tupaki Desk   |   15 Oct 2020 2:00 PM IST
ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి!
X
సుప్రీంకోర్టు జడ్జితో పాటు.. ఏపీ హైకోర్టుకు చెందిన కొందరు జడ్జిలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుల ప్రకంపనలు జాతీయ స్థాయిలో సంచలనంగా మారటం తెలిసిందే. దీనిపై పెద్ద చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ రాసిన లేఖపై తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలి ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు దాని విచారణ జరగాలని కోరారు. ప్రజలకు వివరాలు తెలుసుకునే హక్కు ఉందన్న ఆయన.. ‘‘తగిన విచారణ జరగాల్సి ఉంది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీనిపై మౌనంగా ఉంటారని నేను భావించటం లేదు’’ అని పేర్కొన్నారు.

విచారణకు ఆదేశిస్తారా? లేదా? అన్న విషయాన్ని ఆయనకే వదిలిపెట్టాలన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని.. న్యాయ వ్యవస్థలో పారదర్శకత చాలా అవసరమన్నారు. ప్రధాన న్యాయమూర్తి తర్వాత కాగలిగిన సీనియర్ న్యాయమూర్తిపై ఒకరాష్ట్ర ముఖ్యమంత్రి పలు ఆరోపణలతోకూడిన లేఖను చీఫ్ జస్టిస్ కు రాశారని.. అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని తాను అనుకోవటం లేదన్నారు.

అయితే.. ఎలాంటి విచారణ.. చర్యలు ఉంటాయో తనకు తెలీదన్న గంగూలీ.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కుమార్తెలు ఈ వ్యవహారంలో ఉండటంతో దీనిపై దర్యాప్తు జరగాలన్నారు. మీడియాపై ఏపీ హైకోర్టు గాగ్ ఆర్డర్ జారీ చేయకూడదన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లుగా తనకు గుర్తు లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టింగ్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరిపిందని.. అయితే.. అది ఇలాంటి ఆరోపణ కాదన్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.మరి.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.