Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ వివేక్‌కు బీజేపీలో అసంతృప్తి.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   12 Jun 2021 8:00 AM IST
మాజీ ఎంపీ వివేక్‌కు బీజేపీలో అసంతృప్తి.. రీజ‌నేంటి?
X
నియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ, దివంగ‌త వెంక‌ట‌స్వామి(కాకా) కుమారుడు వివేక్‌కు ఇప్పుడు రాజ‌కీయంగా ఇబ్బందులు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆదిలో కాంగ్రెస్‌, త‌ర్వాత టీఆర్ ఎస్ పార్టీల్లో కీల‌క భూమిక పోషించిన వివేక్‌.. త‌ర్వాత బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలిచిన వివేక్‌.. ఇప్పుడు ఇక్క‌డే బీజేపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

లెక్క‌చేయ‌డం లేదా?
పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని బీజేపీ నేతలు వివేక్‌పై వ్యతిరేకతతో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వివేక్ త‌న సొంత నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నార‌ని.. పార్టీలో సీనియ‌ర్ల‌ను ఆయ‌న లెక్క చేయ‌డం లేద‌ని నాయ‌కులు వాపోతున్నారు. ప్ర‌స్తుతం ఇది.. నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎంపీ వైఖ‌రిపై త్వ‌ర‌లోనే తాము.. కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు కూడా స‌మాచారం.

సీనియ‌ర్లు ఆగ్ర‌హం
కొద్దిరోజుల క్రితం వివేక్‌కి వ్యతిరేకంగా పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని స్థానిక బీజేపీ నేతలు,కార్యకర్తలు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివేక్ వ్యవహార శైలిని వారు తీవ్రంగా ఎండగట్టారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన వివేక్... దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తమను విస్మరిస్తున్నారని ఈ సందర్భంగా నేతలు వాపోయారు. తమను కాదని, సొంత కేడర్‌తో పార్టీ సమావేశాలు,కార్యక్రమాలు నిర్వహించడమేంటని మండిపడ్డారు.

బండిని కాద‌ని కిష‌న్ చెంత‌కు!
ఇటీవ‌ల వ‌ర‌కు అంటే.. గ్రేటర్ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు కూడా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్‌కి స‌న్నిహితంగా మెలిగిన వివేక్‌.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి శిబిరం మార్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోటరీలో చేరిపోయారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి వివేక్ బీజేపీలో చేరిన సమయంలో రాజ్యసభ పదవి లేదా కేంద్ర కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవి హామీతో పార్టీలో చేరినట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే.. బండి సంజయ్‌ని నమ్ముకుంటే ఆ పదవి వచ్చే అవకాశం లేదని భావించిన వివేక్... కిషన్ రెడ్డి కోటరీలోకి మారిపోయారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈట‌ల వెనుక‌..
మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌.. త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్నారు. అయితే.. ఈయ‌న రాక వెనుక వివేక్ చ‌క్రం తిప్పార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటలతో కలిసి పనిచేసిన అనుభవం, టీఆర్ఎస్‌లో ఉన్నప్పటి సంబంధాల నేప‌థ్యంలో ఈట‌ల‌ను బీజేపీలోకి స్వాగ‌తించ‌డం వెనుక వివేక్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఈటల-కిషన్ రెడ్డి మధ్య ఫామ్ హౌస్ మీటింగ్‌కి అంతా తానై వ్యవహరించారని కూడా అంటారు. ఆ తర్వాత ఈటల ఢిల్లీ టూర్‌లోనూ వివేక్ కీలకంగా ఉన్నారు. ఈటలను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేసి... త‌న‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చుకునేందుకు వివేక్ ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలుస్తోంది.

అప్ప‌ట్లోనూ ఇంతే!
ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా ఉన్న వివేక్ స్థానికంగా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. అయితే.. ఆయ‌న‌కు ఈ వ్య‌తిరేకత కొత్త‌కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీఆర్ఎస్‌లో ఉన్న‌ప్పుడు కూడా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,శ్రేణులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నార‌ని వారు ఆరోపించారు. ఈ పరిణామాలే చివరకు ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కకుండా చేశాయి. ఇప్పుడు బీజేపీలోనూ స్థానిక పార్టీ శ్రేణుల నుంచి వివేక్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందోన‌ని ఆస‌క్తిగా గ‌మ‌నిర్త‌సున్నారు క‌మ‌లం పార్టీ నేత‌లు.