Begin typing your search above and press return to search.

చెన్నారెడ్డి ఎపిసోడ్ చెప్పి జగన్ కు వార్నింగ్

By:  Tupaki Desk   |   7 Feb 2020 12:20 PM IST
చెన్నారెడ్డి ఎపిసోడ్ చెప్పి జగన్ కు వార్నింగ్
X
ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న వారంతా బడా కాంట్రాక్టర్లు లేదంటే వ్యాపారవేత్తలు.. అది కూడా కాదంటే పారిశ్రామికవేత్తలు. అందుకే రాజకీయాలకు అవసరమైన గ్రామర్ కంటే డబ్బు..హోదా లాంటి గ్లామర్ ఉన్న నేతలు ఎక్కువయ్యారు. దీని కారణంగా ప్రజలకు ఏం కావాలి? ఏం అవసరం? ఏం చేయాలన్న విషయాలతో పాటు.. గతంలో జరిగిన అంశాల మీద అవగాహన కూడా తక్కువే ఉంటుంది. అయితే.. ఇలాంటి నేతలకు మినహా యింపుగా పాత తరానికి చెందిన నేత.. మంచి మాటకారి ఉండవల్లి అరుణ్ కుమార్. తాజాగా ఆయన మీడియా తో మాట్లాడారు.

పలు అంశాల్ని ప్రస్తావించిన ఉండవల్లి.. సంక్షేమ కార్యక్రమాల విషయంలో హెచ్చరిక చేశారు. ఇంటింటికి పెన్షన్ అనేది పెద్ద బూతుగా పేర్కొంటూ.. సంక్షేమ పథకాల్ని తీసేస్తే బీభత్సమైపోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల వాట్సాప్ లో ఒక పెద్దావిడ వీడియో వైరల్ అయ్యిందని.. అందులో ఒక ముసలమ్మ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ.. నువ్వు ఏసీలో తిరగటం లేదా? మీ అమ్మ ఏసీలో ఉండటం లేదా? అని ప్రశ్నించటం చూశానని.. సంక్షేమ పథకాల్ని ఎత్తేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు.

1989లో కాంగ్రెస్ కు 53.63 శాతం వచ్చాయని.. అప్పట్లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి రేషన్ కార్డులు ఎంతమంది అర్హులకు అందుతున్నాయో సర్వే చేయాలని ఆదేశించారన్నారు. అధికారులు సర్వే చేశారో లేదో కానీ.. సర్వే చేసి కార్డులు తీసేస్తున్నారన్న అలజడి ప్రజల్లో వచ్చిందని.. దీని కారణంగానే ప్రజలు కాంగ్రెస్ ను అధికారం నుంచి తీసేసినట్లు చెప్పారు. రాజధాని అమరావతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పును సీఎం జగన్ చేయొద్దన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. వసతి, సౌకర్యాలు ఎక్కడుంటే అక్కడకే పెట్టుబడులు వస్తాయి. అడుక్కునే వాడి దగ్గరకు వెళ్లి ముష్టెత్తుకుంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మాట మానేసి ప్యాకేజీ, రాయితీలు అడగాలని జగన్‌కు సలహా ఇచ్చారు. అమరావతిని తాను మొదటి నుంచే వ్యతిరేకించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.