Begin typing your search above and press return to search.

అధ్యక్షులంతా అగ్రవర్ణాలవారే... ఓట్లేమో వారివి

By:  Tupaki Desk   |   25 Nov 2022 2:30 AM GMT
అధ్యక్షులంతా అగ్రవర్ణాలవారే... ఓట్లేమో వారివి
X
ఏపీలో చిత్రమైన రాజకీయం సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నియమితుడైన గిడుగు రుద్రరాజుతో ప్రధాన పార్టీలన్నీ ప్రెసిడెంట్ గిరీలను అగ్ర కులం వారికే కట్టబెట్టాయని అంటున్నారు. ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు ఉన్నాయి. ఇందులో వామపక్షాలను పక్కన పెడితే ప్రధాన పార్టీల పదవులు అన్నీ అగ్ర కులానికి వెళ్లాయని ఒక విమర్శ ముందుకు వస్తోంది.

ముందుగా అధికారంలో ఉన్న వైసీపీతో మొదలెడితే ఆ పార్టీ ప్రెసిడెంట్ గా జగన్ ఉన్నారు. టీడీపీకి అధినాయకులుగా ఎన్టీయార్ ఆయన తరువాత చంద్రబాబు ఉన్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అని అచ్చెన్నాయుడుని పెట్టినా కధ అంతా నడిపేది చంద్రబాబే కాబట్టి అగ్ర వర్ణాల పార్టీ అనే టీడీపీని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అగ్ర వర్ణానికి చెందిన వారే.

అలాగే బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సైతం అగ్ర కులం వారే. ఇక నిన్నటిదాకా కాంగ్రెస్ తరఫున అణగారిన వర్గానికి చెందిన సాకే శైలజానాధ్ ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఇపుడు ఆయన మాజీ కావడంతో కొత్తగా గిడుగు రుద్రరాజుకు ఈ పదవి ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ కూడా అటే ఓటేసింది అని ఆ పార్టీలో అంటున్నారు.

రెండు సార్లు ఎంపీగా గెలిచి బలమైన గొంతుకగా అణగారిన వర్గాల నుంచి ఉన్న హర్షకుమార్ తనకు పీసీసీ పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆయన్ని ప్రచార కమిటీ ప్రెసిడెంట్ గా చేశారు. దాంతో ఆయన నిరసన వ్యక్తం చేస్తూ తనకు ఈ పదవి అక్కరలేదని చెప్పేసారు. తాను కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్తగా కొనసాగుతాను అని పేర్కొన్నారు.

అంతే కాదు ఆయన కాంగ్రెస్ ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ ఏపీలో అన్ని పార్టీలలో ఇపుడు అగ్ర వర్ణాల వారే ప్రెసిడెంట్లుగా ఉన్నారని ఎత్తిపొడిచారు. ఆయన ఆవేశంతో అన్నా కూడా చూసుకుంటే అదే సీన్ కనిపిస్తోంది. మరి ఏపీలో అగ్ర వర్ణాల వారు సారధ్యం వహించినా ఓట్లు మాత్రం బడుగు దళిత వర్గాల వారివే కావాలి.

వారే మొత్తానికి డెబ్బై శాతం పైగా ఉన్నారు. మరి వారి ఓట్లతో తాము చక్రం తిప్పుదామని అగ్ర వర్ణాలు భావిస్తున్నారు అంటూ చాలా కాలంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఇపుడు దానికి మరింతగా మంట రాజేస్తూ కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది అని హర్ష కుమార్ లాంటి వారు అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈ అంశం మీద మిగిలిన సామాజిక వర్గాలు గుర్రుగా ఉంటే మాత్రం ఏపీ రాజకీయాలో సామాజిక విప్లవం వస్తుంది అని అంటున్నారు. కానీ అలా జరుగుతుందా అన్నదే చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.