Begin typing your search above and press return to search.

బీజేపీ గూటికి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి?

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:20 PM GMT
బీజేపీ గూటికి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి?
X
జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జంట నగరాల్లో ప్రచార హోరు పెరిగిపోయింది. ఓ వైపు అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుండగా....అసంతృప్త నేతలంతా వేరే పార్టీలలో చేరుతున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల వేళ పలువురు జంప్ జిలానీలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ వార్ లో డీలా పడ్డ కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు బీజేపీ పంచన చేరారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కొంతకాలంగా సొంత పార్టీ కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న మహేందర్ రెడ్డి...పార్టీ‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది.

బల్దియా ఎన్నికల నేపథ్యంలో గురువారం ఉదయం కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన మహేశ్వర్ రెడ్డి....బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులతో మహేశ్వర్ రెడ్డి చర్చలు జరిపారన్న టాక్ వస్తోంది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ భూపేంద్ర యాదవ్‌తో మహేశ్వర్‌రెడ్డి భేటీ అయి ఆయన సమక్షంలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

గ్రేటర్ వార్ కోసం టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడంతో కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడినట్టు కనిపిస్తోందని, దీనికి తోడు ఎన్నికలకు ముందు పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోవడం గట్టి ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు. ఆ ఆటుపోట్లను తట్టుకొని బల్దియా బరిలో కాంగ్రెస్ ఎంతవరకు రాణిస్తుందన్నది వేచి చూడాలి.