Begin typing your search above and press return to search.

జగన్ కి షాక్ ఇస్తానంటున్న మాజీ మంత్రి... ?

By:  Tupaki Desk   |   14 Dec 2021 8:30 AM GMT
జగన్ కి షాక్ ఇస్తానంటున్న మాజీ మంత్రి... ?
X
వైసీపీకి ఆదరణ ఉంటుందని, ఈసారి తప్పకుండా గెలుస్తుందని భావించి చాలా మంది 2019 ఎన్నికల ముందర చేరిపోయారు. అలా వెల్లువలా వచ్చిన వారిలో విశాఖ జిల్లాలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరు. ఆయన అంతకు ముందు అంటే 2013లో చేరి 2014 ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే వైసీపీ ఓడిపోవడంతో ఆయన వెంటనే పార్టీని వీడిపోయారు. అయితే గెలుస్తామనుకున్న వేళ 2019లో వచ్చి చేరడంతో పాటు ఆఖరు నిముషంలో రావడంతో ఆయనకు ఎటువంటి అవకాశాన్ని జగన్ ఇవ్వలేకపోయారు.

అయితే దాడి వీరభద్రరావు సీనియర్ మోస్ట్ నేత. టీడీపీలో ఎన్టీయార్ మన్ననలు అందుకున్న వారు. ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టిన ఘనాపాఠి. అయితే ఆయన తన కుమారుడు రత్నాకర్ కోసమే రాజకీయాల్లో ఈ రోజుకీ కొనసాగుతున్నారు. ఏడు పదులు దాటిన దాడి పెద్దల సభలో ఎమ్మెల్సీగా ఉండాలనుకున్నారు. కానీ జగన్ తాజాగా ఎమ్మెల్సీల ఎంపికలో ఆయనకు మొండి చేయి చూపించారు.

దాంతో ఆయనలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఏర్పడింది అంటున్నారు. తనతో పాటు తన కుమారుడికి కూడా ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వలేదన్న ఆగ్రహం ఆయనలో ఉందని చెబుతున్నారు. దాంతో సరైన సమయం చూసుకుని పార్టీని వీడాలని ఆయన ఆలోచిస్తున్నారన్న వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఎన్నికల్లో కూడా తన కుమారుడికి దక్కదు అన్న అంచనాలేవో ఆయనకు ఉన్నాయట. అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమరానాధ్ అంటే జగన్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన మాట మేరకే దాడి ఫ్యామిలీని దూరం పెట్టారని కూడా టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడకే టికెట్ అక్కడ కన్ఫర్మ్ అని కూడా అంటున్నారు. ఈ మధ్యలో ఏమైనా అవకాశం ఉంటే మంత్రి పదవి కూడా ఆయనకు ఇస్తారని అంటున్నారు.

ఈ పరిణామాలను అన్నీ గమనిస్తున్న దాడి వర్గం ఒక్క లెక్కన రగులుతోంది అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బయటకు రావాలని దాడి ఆలోచిస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఆయన బయటకు వచ్చి ఏ పార్టీలో చేరుతారు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది. గతంలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన దాడి చంద్రబాబు మీద దారుణంగా విమర్శలు చేశారు. పైగా జిల్లా రాజకీయాల్లో ఆయనకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో విరోధం ఉందని, ఆయన దాడిని పార్టీలో చేర్చుకుంటే ఒప్పుకోరు అని కూడా అంటున్నారు.

ఇక మూడేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ చేసినపుడు జనసేనలో చేరమని దాడిని ఇన్వైట్ చేశారు. స్వయంగా దాడి ఇంటికి వెళ్ళి మరీ పవన్ ఆహ్వానం పలికారు. అప్పట్లో దాడి ఏ సంగతి చెప్పలేదు, చివరి నిముషంలో వైసీపీలో ఆయన చేరిపోయారు. ఇపుడు ఆయన చూపు జనసేన మీద ఉందన్న చర్చ కూడా సాగుతోంది. అయితే బీజేపీలో చేరమని కూడా ఆయన మీద వత్తిళ్ళు ఉన్నాయట. మొత్తానికి తొందరలోనే వైసీపీ నుంచి ఈ మాజీ మంత్రి తన అనుచరులతో పాటుగా వేరుపడిపోతారని, జగన్ మీద ఇక సమరమే అంటారని కూడా జిల్లా రాజకీయాల్లో చర్చ అయితే గట్టిగానే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.