Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి

By:  Tupaki Desk   |   2 Sep 2019 4:37 AM GMT
మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి
X
మాజీ మంత్రి - దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మరణించారు. ఆయ‌న ఎమ్మెల్యేగా - మంత్రిగా ఉన్నా ఎప్పుడూ సామాన్య ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు పొందారు. ఆయ‌న జీవిత కాలంలో ఎల్ల‌ప్పుడు నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డే రాజ‌కీయాలు చేశారు. నిరాడంబ‌రుడు - పాత‌త‌రం రాజ‌కీయ నేత‌గా ఆయ‌న్ను పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు గుర్తుంచుకుంటారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలోని తొగుట ఆయ‌న స్వ‌గ్రామం. టీడీపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రిగా ప‌నిచేశారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దొమ్మాట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గం పేరు మారి దుబ్బాక‌గా అవ‌త‌రించాక మ‌రోసారి గెలిచారు. టీడీపీ నుంచి 2004 ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న త‌ర్వాత 2004 ఉప ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నుంచి హ‌రీష్‌ రావుపై పోటీ చేసి మ‌రోసారి ఓడారు. ఇక 2009లో ఆయ‌న‌కు టీఆర్ ఎస్‌ తో పొత్తు కార‌ణంగా సీటు రాక‌పోవ‌డంతో వైఎస్ పిలిచి మ‌రీ ఆయ‌న‌కు కాంగ్రెస్ సీటు ఇవ్వ‌గా విజ‌యం సాధించారు.

ఆయ‌న‌ చివరి సారిగా 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో... నిరాశ చెందిన ఆయన ఎన్నికల ముందు టీఆర్ ఎస్‌ గూటికి చేరారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన మృతిపట్ల టీఆర్ ఎస్‌ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

ముత్యంరెడ్డి లాంటి నిరాడంబ‌రుడు లాంటి రాజ‌కీయ నేత‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హ‌రీష్‌ రావు - రామ‌లింగారెడ్డి అన్నారు. వీరు ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలిపారు.