Begin typing your search above and press return to search.

బొజ్జల : బాబుకు నిజమైన దోస్త్

By:  Tupaki Desk   |   6 May 2022 11:58 AM GMT
బొజ్జల : బాబుకు నిజమైన దోస్త్
X
ఆయన కరడు కట్టిన టీడీపీ నాయకుడు. అన్నింటికీ మించి చంద్రబాబుకు గట్టి నేస్తం. ఆయనతోనే తన రాజకీయ పయనాన్ని మొదలుపెట్టి ఆయనతోనే కడదాకా కొనసాగారు. ఆయనే ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాహస్తికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. ఆయనది రాజకీయ కుటుంబం. తండ్రి సుబ్బరామిరెడ్డి 1967లోనే కాంగ్రెస్ ని ఓడించి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

అలా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బొజ్జలకు తండ్రి నుంచి సహకారం కంటే రాజకీయ అభిలాష మాత్రమే కలిసివచ్చింది. ఇక ఆయనది చంద్రబాబుతో 70 దశకం నుంచి మొదలై కడదాకా సాగిన చిరకాల స్నేహం. బొజ్జల సోదరుడికి బాబు స్నేహితుడు. అలా నాడు కాంగ్రెస్ లో మంత్రి అయిన బాబుతో బొజ్జలకు స్నేహాం కుదిరింది. అది జీవిత పర్యంతం కొనసాగింది.

ఇక బొజ్జల కూడా బాబు వెంట కాంగ్రెస్ లోనే ఉండేవారు 1983లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఆయన చంద్రబాబుతో పాటే టీడీపీలోకి అడుగుపెట్టారు. ఇక ఆ టైమ్ లో 1983లో కాళహస్తి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధి అడ్డూరు దశరధరామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో టీడీపీ నుంచి బొజ్జల పోటీ చేయలేదు. పార్టీ తరఫున అభ్యర్ధిగా సత్రవాడ మునిరామయ్య పోటీ చేసి గెలిచారు.

నాడు బొజ్జల టీడీపీ గెలుపునకు కృషి చేశారు. ఇక 1989 నాటికి బొజ్జలకు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్ వచ్చింది. దాంతో మొదటి విడతలో గెలిచి సత్తా చాటారు. 1994లో రెండవమారు గెలిచారు. నాడు ఆయన బాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 1999, 2009, 20014లో మరో నాలుగు సార్లు శ్రీకాళహస్తి నుంచి గెలిచి తిరుగులేని నాయకుడిగా నిలిచారు. ఆయన 2004లో ఒకే ఒకసారి ఓటమి పాలు అయ్యారు.

చంద్రబాబుతో ఆయనది మంచి స్నేహం. గోపాల్ అంటూ బాబు చనువుగా పిలుస్తారు. బొజ్జల కోపాలు, ప్రేమలు అన్నీ ఎపుడూ కూడా బాబుతోనే. 2017లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా బొజ్జల మంత్రి పదవి పోయింది. నాడు ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే బాబుతో ఉన్న దోస్తీతోనే మళ్ళీ సర్దుకుపోయారు. 2019 ఎన్నికల నాటికి ఆయన రాజకీయ వారసుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ అబ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి బియ్యపు మధుసూదన రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇక బొజ్జల వ్యక్తిగతానికి వస్తే ఆయన న్యాయవాదిగా కొన్నాళ్ళు హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేశారు. రాజకీయాల పట్ల ఆసక్తితో తొలుత కాంగ్రెస్ లో తరువాత టీడీపీలో కొనసాగారు. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్ మంత్రి కావడంతో ఆయన ప్రధాన అనుచరుడిగా బొజ్జల మొదటి నుంచి ఉన్నారు.

వీరిద్దరి స్నేహానికి నిదర్శనం ఎపుడూ కలసినడిచేవారు. అలా 2004 అక్టోబర్ 1న తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన నక్సలైట్లు పేల్చిన బాంబు ఘటనలో కూడా బాబుతోనే బొజ్జల ఉన్నారు. అయితే నాటి దుర్ఘటనలో బొజ్జలకు తీవ్ర చాతిపైనా పొట్టపైన తీవ్ర గాయాలు అయ్యాయి. బొజ్జల పరిస్థితి ఒక దశలో తీవ్రమని కూడా అంతా అనుకున్నారు. అయితే ఆయన మొత్తానికి కోలుకున్నారు కానీ నాటి నుంచి అనారోగ్యం మాత్రం ఆయనను వెంటాడింది.

దాని ఫలితంగానే ఆయన మునుపటి అంత చురుకుగా ఉండేవారు కాదని చెబుతారు. మంత్రి పదవి పోయాక 2017 తరువాత ఆయన పూర్తిగా క్రియాశీల రాజకీయల నుంచి దూరమై రెస్ట్ తీసుకుంటూ వచ్చారు. ఇక ఆ మధ్య కొన్నాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆ సమయంలో తన స్నేహితుడి కోసం బాబు ఆసుపత్రికి వెళ్ళి మరీ పరామర్శించారు. గోపాల్ మళ్ళీ కోలుకుంటావ్ నీవు అని ధైర్యం చెప్పారు. ఆ తరువాత కోలుకుని బొజ్జల ఇంటికి వస్తే ఆయన పుట్టిన రోజు వేడుకలకు కూడా బాబు ఇంటికెళ్ళి మరీ బొజ్జల చేత కేక్ కట్ చేయించారు.

ఇలా బాబుకు రాజకీయాల్లో ఉన్న అతి తక్కువ మంది స్నేహితులలో బొజ్జల ఒకరు. బొజ్జల సైతం బాబుతోనే అంతా అంటూ వచ్చారు. చివరికి ఆయన టీడీపీ నాయకుడిగానే తనువు చాలించారు. మంచి వ్యక్తిత్వం, ముక్కుసూటితనం, మచ్చలేని విధానం, నిజయతీ ఇవే బొజ్జలకు అసలైన ఆభరణాలు. ఆయన మరణంతో శ్రీకాళహస్తి మంచి నేతను కోల్పోయింది అనే చెప్పాలి.