Begin typing your search above and press return to search.

వాకింగ్ చేస్తుంటే బైక్ ఢీ కొట్టి మాజీ మంత్రి మృతి

By:  Tupaki Desk   |   28 Sept 2019 10:26 AM IST
వాకింగ్ చేస్తుంటే బైక్ ఢీ కొట్టి మాజీ మంత్రి మృతి
X
మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మన ముందున్నోడు.. వెనుక నుంచి వచ్చేటోడు జాగ్రత్తగా లేకున్నా ప్రమాదమే. ఇటీవల కాలంలో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటోంది. అదెంత ముఖ్యమన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. మాజీ మంత్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బలిరెడ్డి సత్యారావు మరణాన్ని చూస్తే.. అయ్యో అనకుండా ఉండలేం.

సీనియర్ నేతగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన విశాఖ బీచ్ రోడ్డులో తన పాటికి తాను వాకింగ్ చేస్తున్నారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఒకటి ఆయన్ను బలంగా ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

ఆయన మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.ఆయన మరణం విశాఖ జిల్లా పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. విశాఖపట్నం జిల్లా చోడవరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 1989.. 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పని చేశారు.

2004లో గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాతి కాలంలో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మరణాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. తన పాటికి తాను వాకింగ్ చేస్తుంటే.. వెనుక నుంచి బైక్ ఢీ కొట్టటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. బైక్ ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.