Begin typing your search above and press return to search.

కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ !

By:  Tupaki Desk   |   23 July 2021 5:33 AM GMT
కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ !
X
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. మాజీ ఐపీఎస్ అధికారి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆయనకి ఇంకా సర్వీస్ సమయం ఉన్నప్పటికీ స్వచ్ఛంద పదవి విరమణ ప్రకటించి సంచలనంగా మారాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినప్పటినుండి మొదలు ఆయన రాజకీయ ఎంట్రీ పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కేసీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసాడని కొందరంటే, లేదు బీఎస్పీ పార్టీలో చేరతారని మరికొందరన్నారు. మరికొందరేమో ఆయన నూతన రాజకీయ పార్టీని పెట్టబోతున్నారని అన్నారు. మరోవైపు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికే తన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

అయితే, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి తన రాజకీయ ప్రస్థానంపై కొంచెం క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో బహుజనులే కేంద్ర బిందువుగా ఒక నూతన రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదని, బహుజనులకు న్యాయం చేసేందుకే తాను బయటకు వచ్చానని ప్రవీణ్ కుమార్ అన్నారు. తన పొలిటికల్ ఎంట్రీ గురించి మరింత క్లారిటీ ఇస్తూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమే అని, కానీ అదెప్పుడు జరుగుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్షిప్తమై ఉందని, ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన 99 శాతం మంది బహుజనుల కోసమే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రాదల్చుకున్నట్టు చెప్పారు.

తనకింకొక ఆరేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ, దాన్ని వదులుకొని తాను రాజీనామా చేసానని, ఈ సమయాన్ని వృధా చేయదల్చుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడెకరాలు, పేదలకు ఇండ్లు, ఇవి కాదు చేయాల్సిందని, వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడమే తన ముందున్న తదుపరి లక్ష్యమని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఒక అధికారిగా తనకున్న పరిమితులకు లోబడి మాత్రమే పనిచేశానని, ఇక ఇప్పుడు బహుజనుల అభ్యున్నతి కోసం ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు.

సాంఘీక సంక్షేమ గురుకులాల్లో అన్యాయానికి, అక్రమాలకు తావు లేదని, ఒకవేళ తానెక్కడైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే ఉరికంబం ఎక్కేందుకు కూడా తాను సిద్ధమే అని తెలిపారు ప్రవీణ్ కుమార్. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అన్యాయానికి, అక్రమాలకు తావు లేదని, ఒకవేళ తానెక్కడైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే ఉరికంబం ఎక్కేందుకు కూడా తాను సిద్ధమే అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఇకపోతే, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మెజారిటీ ప్రజలు పూజించే హిందు దేవతల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారంటూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి గతంలో చేసిన ఫిర్యాదుని విచారణకు స్వీకరించిన కోర్టు ఆయనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా త్రీ టౌన్ పోలీసులను ఆదేశించింది.

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఫిర్యాదుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇదే ఏడాది ఫిబ్రవరి 16న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపిస్తూ లాయర్ మహేందర్ రెడ్డి మార్చి 22న స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహేందర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ.. ఈ కేసులో ఆర్.ఎస్.

ప్రవీణ్ కుమార్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సామాజిక సేవ చేయాలనే లక్ష్యంతో ఐపిఎస్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌ గా ఎదుర్కోనున్న తొలి కేసు ఇదే కావడం గమనార్హం. ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణకు చేసుకున్న దరఖాస్తు ఆమోదం పొందిన మరునాడే ఆయనపై ఇలా కేసు నమోదుకు ఆదేశాలు రావడం చర్చనియాంశమైంది.