Begin typing your search above and press return to search.

అలా చేయొద్దు.. చేస్తే.. దేశ విభ‌జ‌న ఖాయం: ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక‌

By:  Tupaki Desk   |   31 July 2022 11:34 AM GMT
అలా చేయొద్దు.. చేస్తే.. దేశ విభ‌జ‌న ఖాయం:  ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక‌
X
భారత ఆర్థిక పురోగతి, దేశ ప‌రిస్థితుల‌పై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నార‌ని.. ఇలా చేస్తుండ‌డం.. దేశ విభ‌జ‌న‌కు దారితీస్తుంద‌ని హెచ్చ‌రించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక విభాగమైన 'ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌' రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఐదో వార్షికోత్సవంలో ఆయ‌న మాట్లాడారు.

మెజారిటీవాదం బలపడి.. ఒకదేశ రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నార‌ని.. అది దేశాన్నే విభజిస్తుందని హెచ్చ‌రించారు. ఫలితంగా దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం కూడా చోటుచేసుకునే పరిస్థితి వస్తుందన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని రాజన్‌ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిరేటు మందగించడానికి కొవిడ్‌-19 సంక్షోభం ఒక్కటే కారణం కాదన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్‌ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదన్నారు. యువకులకు అవసరమైన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. దీనికి ఎవ‌రిని త‌ప్పుబ‌ట్టాలో తెలియ‌డం లేద‌న్నారు.

యువత ఉద్యోగాల కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో చెప్పడానికి కొత్త సైనిక నియామకాల పథకం 'అగ్నిపథ్‌'పై చెలరేగిన ఆందోళనలే ఉదాహరణ అని రాజ‌న్ వివరించారు. దేశంలో ఇప్పటికీ మెజారిటీ మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. అయినా, ఉద్యోగాల్లో పోటీ ఈ స్థాయిలో ఉండడం విచారకరమని వ్యాఖ్యానించారు. 35 వేల రైల్వే ఉద్యోగాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప‌రిస్థితిని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.