Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ పై మాజీ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ప్రశంసలు !

By:  Tupaki Desk   |   30 Nov 2021 8:30 AM GMT
ప్రధాని మోడీ పై మాజీ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ప్రశంసలు !
X
ఇంగ్లండ్ మాజీ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షంకురిపించారు. కరోనా వైరస్ సంక్షోభం మధ్య ఆఫ్రికన్ దేశాల పట్ల భారత్ సాయం, నిబద్ధతను చూసి పీటర్సన్ సంతోషం వ్యక్తంచేశాడు. భారత్ అత్యంత అద్భుతమైన దేశమంటూ చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. 18 నెలల తర్వాత ఈ సంక్షోభం నుంచి ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటుందన్న సమయంలో దక్షిణాఫ్రికా లో కొత్త కరోనా వేరియంట్‌ వెలుగులోకి రావడం మరోసారి ఆందోళనకు గురి చేస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ ను ఓమిక్రాన్ వైరస్‌ గా పేరు పెట్టింది. ఈ కొత్త వేరియంట్‌ తో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న హెచ్చరికలతో ప్రపంచం మళ్లీ ఆలోచనలో పడింది. కొన్ని చోట్ల అప్పుడే ఈ వేరియంట్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒమిక్రాన్ ప్రమాదం పొంచివుండటంతో ఇప్పటికే చాలా దేశాలు కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ మొదటి కేసును నివేదించడంతో చాలా దేశాలు ప్రయాణ నిషేధాలు, ఇతర ఆంక్షల విధించడంతో ఆఫ్రికా దేశాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ, భారత్ ఆఫ్రికా ఖండానికి సహాయం చేయడానికి ముందడుగు వేయడంపై పీటర్సన్ సంతోషం వ్యక్తంచేస్తూ ట్విట్ చేశాడు.

భారత్ చేసిన ప్రకటనను రీట్విట్ చేస్తూ ప్రధాని మోదీని ప్రశంసించాడు. ఓమిక్రాన్ ప్రమాదంలో ఉన్న ఆఫ్రికాలోని దేశాలకు భారత్ సహాయానికి సంబంధించిన ట్విట్‌కు పీటర్సన్ రీట్విట్ చేశాడు. ఈ సందర్భంగా పీటర్సన్ ట్వీట్ చేస్తూ.. భారత్ మరోసారి ఆ కేరింగ్ స్పిరిట్‌ ను చూపింది, అందుకే చాలా మంది హృదయపూర్వక వ్యక్తులతో అత్యంత అద్భుతమైన దేశంగా నిలించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అంటూ పీటర్సన్ ట్విట్‌ లో రాశాడు. కాగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్రికన్ దేశాలకు మేడ్-ఇన్ ఇండియా వ్యాక్సిన్‌లను సరఫరా చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్‌ తో బాధపడుతున్న ఆఫ్రికాలోని దేశాలకు మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్‌ల సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ తెలిపింది.