Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఇంకా బతికే ఉందని చాటిన కిరణ్

By:  Tupaki Desk   |   1 Aug 2018 5:11 PM GMT
కాంగ్రెస్ ఇంకా బతికే ఉందని చాటిన కిరణ్
X
ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎంతోకాలం తరువాత ఈవేళ చాలామందికి తెలిసింది. విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ కళకళలాడింది. ఆ కళకళ విజయవాడ వీధుల్లోనూ కనిపించింది. రాష్ట్ర విభజన తరువాత మంచం పట్టేసిన కాంగ్రెస్ పార్టీ తానింకా బతికే ఉన్నానంటూ పత్రికా ప్రకటలు విడుదల చేయడం.. అప్పుడప్పుడు ధర్నాలు చేయడం మినహా పార్టీకి జీవం పోసేలా ఏ కార్యక్రమమూ చేయలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి - చిన్నాచితకా నేతలు తప్ప ఇంకెవరూ కనిపించడమే మానేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు విజయవాడలో మళ్లీ కాంగ్రెస్ జెండాలు కనిపించేలా చేయగలిగారు. దీనికి కారణం.... ఆ పార్టీకి చెందిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డే అని చెప్పాలి. కొద్దిరోజుల కిందట తిరిగి కాంగ్రెస్ లో చేరిన ఆయన తొలిసారి విజయవాడ రావడంతో ఈ ఉత్సాహం కనిపించింది.

కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కిరణ్‌కు గన్నవరం విమానాశ్రయం నుంచే భారీ ఎత్తున స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు. గన్నవరం నుంచి విజయవాడ ప్రభుత్వ అతిధి గృహానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ఉమెన్ చాందీతో కలసి ఆయన రాగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనను కలుసుకున్నారు. శాలువలు కప్పి స్వాగతం పలికారు. తర్వాత ప్రభుత్వ అతిధి గృహం నుండి యుత్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ఆంధ్రరత్న భవన్ కు బయలు దేరారు. దారి పొడగునా కిరణ్ కు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో జనానికి మరోసారి కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది.

2014 లో కాంగ్రెస్ దారుణ పరాజయం తరువాత చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి జారుకున్నారు. కొందరు ఎటూ కాకుండా 2019 ఎన్నికల ముందు పరిస్థితులు చూసి వెళ్దాం అన్నట్లుగా ఖాళీగా ఉన్నారు. చిరంజీవి పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఉండవల్లి - హర్షకుమార్ లాంటివారు తటస్థంగా ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆనం టీం టీడీపీలోకి వెళ్లి అక్కడి నుంచి వైసీపీ వైపు చూస్తోంది. ఇక విజయవాడ వరకు చూస్తే విజయవాడ సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు ఎప్పుడో వైసీపీలో చేరిపోయారు. లగడపాటి కూడా ఇతర పార్టీల వైపే చూస్తున్నారు కానీ కాంగ్రెస్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాయలసీమలో డీఎల్ రవీంద్రరెడ్డి వంటివారు పార్టీకి దూరంగా ఉన్నారు. శైలజానాథ్ కొద్దికాలం రఘువీరాతో కలిసి తిరిగినా ఇప్పుడాయన ఆలోచనా వేరేగా ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలాకాలం తర్వాత కాంగ్రెస్ లో కళ కనిపించింది. అక్టోబర్ 2 నుంచి ఇంటి ఇంటికి కాంగ్రెస్ పేరు తో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నట్లు కిరణ్ ప్రకటించడంతో కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో జీవం పోసుకోవడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.