Begin typing your search above and press return to search.

ఓపీఎస్‌కు మ‌ళ్లీ నిరాశే!

By:  Tupaki Desk   |   2 Sep 2022 10:53 AM GMT
ఓపీఎస్‌కు మ‌ళ్లీ నిరాశే!
X
త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే ప‌గ్గాలు మాజీ ముఖ్య‌మంత్రి ఈకే ప‌ళ‌నిస్వామి (ఈపీఎస్) కే ద‌క్కాయి. ఈ మేర‌కు మ‌ద్రాసు హైకోర్టు ప‌ళ‌నిస్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకేకు ప‌ళ‌నిస్వామే నాయకుడ‌ని తేల్చిచెప్పింది. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ఎన్నిక చెల్లుతుంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ పేర్కొంది. ఈ క్ర‌మంలో గ‌తంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మ‌ద్రాస్ హైకోర్టు ప‌క్క‌న‌పెట్టింది.

2017లో త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత క‌న్నుమూశాక రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. బీజేపీ మ‌ద్ద‌తుతో ఓ ప‌న్నీర్ సెల్వం ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే జ‌య‌లలిత నెచ్చెలి శ‌శిక‌ళ తాను ముఖ్య‌మంత్రిని కావాల‌ని భావించారు. పార్టీపైనా పట్టు సాధించారు. అయితే శ‌శిక‌ళ‌ను అక్ర‌మాస్తుల కేసులో క‌ర్ణాట‌క‌లోని జైలుకు పంపారు. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ ఆశీస్సుల‌తో ఈకే ప‌ళ‌ని స్వామి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఆ త‌ర్వాత ప‌ళని స్వామి, ప‌న్నీరు సెల్వం ఇద్ద‌రూ ఏక‌మ‌య్యారు. పార్టీ నుంచి శ‌శిక‌ళ‌ను, ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్‌ను బ‌హిష్క‌రించారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రిగా, పార్టీ కో క‌న్వీన‌ర్ గా ఈకే ప‌ళ‌ని స్వామి, పార్టీ క‌న్వీన‌ర్‌, డిప్యూటీ సీఎంగా ప‌న్నీరు సెల్వం బాధ్య‌త‌లు చేపట్టారు. ఇలా అన్నాడీఎంకే ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలాన్ని ఈ నేత‌లిద్ద‌రూ పూర్తి చేశారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే అధికారంలోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకేపై ప‌ట్టు కోసం ప‌ళ‌ని స్వామి, ప‌న్నీరు సెల్వం ఇద్ద‌రూ పోటీప‌డ్డారు. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు, పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శుల్లో అత్య‌ధికం ప‌ళ‌ని స్వామికే జై కొట్టారు. దీంతో ప‌న్నీరు సెల్వంను, ఎంపీగా ఉన్న ఆయ‌న కుమారుడిని అన్నాడీఎంకే నుంచి బ‌హిష్క‌రించారు. దీంతో ప‌న్నీరు సెల్వం హైకోర్టును ఆశ్ర‌యించారు. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (అన్నాడీఎంకేకు పార్టీ సుప్రీంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శే ఉంటారు) గా త‌న‌నే గుర్తించాల‌ని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల మ‌ద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ప‌న్నీరు సెల్వంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై ప‌ళ‌ని స్వామి అప్పీలు చేయగా హైకోర్టు డివిజ‌న్ బెంచ్ పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది.

జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయిన సంగ‌తి తెలిసిందే. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టునును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.