Begin typing your search above and press return to search.

బ్యానర్లతో రచ్చ చేసిన వీరప్పన్ భార్య

By:  Tupaki Desk   |   20 Oct 2015 9:16 AM GMT
బ్యానర్లతో రచ్చ చేసిన వీరప్పన్ భార్య
X
కొన్ని విషయాలకు అవకాశమే ఇవ్వకూడదు. కాస్త భరోసాతో అవకాశం ఇస్తే చాలు.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్న వివాదాస్పద వ్యక్తులకు అవకాశం ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుందన్న విషయం తాజాగా వీరప్పన్ భార్య విషయంలో మరోసారి నిరూపితమైంది.

తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలను ధశాబ్దాల తరబడి వణికించి.. అక్రమంగా గంధం చెక్కలు.. ఏనుగు దంతాల్ని భారీగా వ్యాపారం చేసి.. అటవీ సంపదను దోచుకున్న కిల్లర్ వీరప్పన్ వర్థంతిని గ్రాండ్ గా నిర్వహించాలని ఆయన సతీమణి ముత్తులక్ష్మి భావించారు. ఇందులో భాగంగా అనుమతుల కోసం అధికారుల్నిసంప్రదిస్తే వారు కుదరదన్నారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.

వీరప్పన్ వర్ధంతి సందర్భంగా బ్యానర్ల ఏర్పాటు మొదలుకొని.. వివిధ కార్యక్రమాలపై పరిమితులు విధిస్తూ మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ.. పరిమితుల్ని అధిగమిస్తూ.. సంస్మరణ జరిగే ప్రాంతాల్లోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ బ్యానర్లు.. పోస్టర్లు ఏర్పాటు చేయటం కలకలం రేపింది.

నిజానికి స్మగ్లర్ గా.. అటవీ సంపదను దోచుకోవటంతో పాటు.. ఎందరో అధికారుల్ని పొట్టనబెట్టుకున్న వీరప్పన్ లాంటి వ్యక్తికి సంబంధించి బహిరంగ కార్యక్రమాలు చేపట్టేలా అవకాశం ఇవ్వటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసులు ఆమె లాంటి వారిని కదిలిస్తాయా..?