Begin typing your search above and press return to search.

27 కోట్లు.. `తాత్కాలికంగా` క‌రిగిపోయాయ్‌

By:  Tupaki Desk   |   1 Oct 2017 5:30 PM GMT
27 కోట్లు.. `తాత్కాలికంగా` క‌రిగిపోయాయ్‌
X
ఏపీలోని టీడీపీ ప్ర‌భుత్వంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలో చేప‌డుతున్న ప‌లు క‌ట్ట‌డాలను ``తాత్కాలికంగా`` నిర్మిస్తూ.. వీటికి కోట్ల‌కు కోట్లు ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేయ‌డంపై జ‌నాలు నిప్పులు చెరుగుతున్నారు. వాస్త‌వానికి తాత్కాలిక నిర్మాణం అంటే.. ఏదైనా స్థిరంగా నిర్మాణం చేసుకోవాల్సిన బిల్డింగ్ విష‌యంలో మితిమీరిన తాత్సారం జ‌రిగిన‌ప్పుడో.. లేదా.. ఇక‌, తాత్కాలికంగానైనా ఏదో ఒక‌టి లేక‌పోతే.. ప‌ని పూర్తిగా నిలిచిపోతుంద‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో తాత్కాలిక నిర్మాణాల‌పై దృష్టి పెడ‌తారు.

కానీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం మాత్రం.. అయిన దానికీ కానిదానికీ తాత్కాలికం పేరిట ప్ర‌జాధ‌నాన్ని వృథా చేస్తూ.. తాము ప‌ని చేస్తున్నామ‌ని చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా అమ‌రావ‌తి ప్రాంతంలో జ‌రుగుతున్న నిర్మాణంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏం ఆశించి ఈనిర్మాణం చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని ప్రాంతం మంగళగిరిలో హడావుడిగా తాత్కాలిక ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ ఎస్‌ ఎల్‌) నిర్మాణాన్ని చేప‌ట్టారు. దీనికిగాను రూ.27 కోట్ల‌ను కేటాయించారు.

అయితే, ఈ నిర్మాణ బాధ్య‌త కేంద్రానిదే. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇటీవ‌ల కేంద్రం వెల్ల‌డించింది. అన్న‌దే త‌డ‌వుగా ఈ నెల 27న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీని మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు. పోలీసు మౌలిక వసతుల కల్పన - శిక్షణ సంస్థలు - దర్యాప్తు సదుపాయాల నిమిత్తం కేటాయించిన రూ.100 కోట్లలోంచి అమరావతి ఎఫ్‌ ఎస్‌ ఎల్‌ కు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో దీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంద‌న్నారు.

ఇలా కేంద్రం ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిసినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏప్రిల్‌ 13న మంగ‌ళ‌గిరిలో తాత్కాలిక ఎఫ్ ఎస్ ఎల్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసింది. దీనికిగాను రూ.27 కోట్లు కేటాయించేసింది. పోనీ.. ఇది లేక‌పోతే.. ప‌నులు ఆగిపోతున్నాయ‌ని, ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని అందామా అంటే.. ఏపీలో మొత్తం 5 కీల‌క ప్రాంతాల్లో ఐదు ఎఫ్ ఎస్ ఎల్ కేంద్రాలు ఉన్నాయి. విశాఖ - విజయవాడ - గుంటూరు - కర్నూలు - తిరుపతిలో చ‌క్క‌గా ప‌నిచేస్తున్నాయి. వీటికితోడు హైద‌రాబాద్‌ లోని ప్ర‌ధాన కేంద్రంలో మ‌న‌కు ప‌దేళ్ల‌పాటు ప‌నిచేసుకునే వెసులు బాటు ఉంది. అయినా కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌త్కాలికం పేరిట ప్ర‌జాధ‌నాన్ని కాంట్రాక్ట‌ర్ల‌కు దోచి పెడుతుండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేంద్ర‌మే స్పందించి ఈ నిర్మాణానికి డ‌బ్బు ఇచ్చేందుకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో శాశ్వ‌త నిర్మాణం దిశ‌గా అడుగులు వేయాల్సిన బాబు.. ఇలా త‌త్కాలికం అంటూ కాలం వెళ్ల‌బుచ్చ‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. మ‌రి బాబుఅండ్ కో స్పందిస్తుందో లేదో చూడాలి.